ముకేష్ అంబానీ మరో ఎత్తుగడ..?

20 Sep, 2016 13:55 IST|Sakshi
ముకేష్ అంబానీ మరో ఎత్తుగడ..?

ముంబై: బిలియనీర్,  రిలయన్స్ ఇండస్ట్నీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా  ముఖ్యమైన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు  కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కంపెనీలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన  ప్రతిభ గల టాప్ వంద మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్  ప్రకటించనున్నారు.  సగటున రెండుకోట్ల జీతం తీసుకుంటున్నఉద్యోగులకు వారి వేతనాల్లో  10-15శాతం మేరకు సంస్థ షేర్ల రూపంలో అందించనున్నారు.
 లాంగ్-టర్మ్  ఇన్సెంటివ్ ప్లాన్  అని పేరు పెట్టిన ఈ పథకం   ప్రకారం సగటున రూ .2 కోట్ల ఆదాయం  ఉన్న ఉద్యోగులకు  ఈ ప్రోత్సాహకాలు రిలయన్స్ అందించనుందని సంస్థకు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.  దాదాపు 20-30 లక్షల  విలువ చేసే షేర్లను   ఆయా ఉద్యోగులకు ఎలాట్ చేయనుంది.  దీనికి నిర్దేశించిన కాలపరిమితి  మూడు సంవత్సరాలు పూర్తికాగానే ఈ ఎలాట్ మెంట్ ఉంటుంది. ఈ బోనస్  సంస్థలో టాప్ 100 ఉద్యోగులకోసమే మాత్రమే ఉద్దేశించబడిందనీ,  ఇతర స్థాయిల్లో ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు.  అయితే ఈ వార్తలపై రిలయన్స్  ఇంకా స్పందించాల్సి ఉంది.

మరోవైపు ఈ వార్తలను ధృవీకరించిన సంస్థ ఉన్నతోద్యోగి  ఎలాంటి షేర్లను కేటాయించాలి అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. రిలయన్స్ లాంటి షేర్లను కేటాయిస్తామంటే ఎవరు మాత్రం కాదంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన వ్యాఖ్యానించారు.  సంస్థ లాభాలను, సంపదను ఉద్యోగులకు పంచి ఇచ్చే   సాంప్రదాయం  రిలయన్స్  గ్రూపునకు  కొత్త అని  మరో ఆర్ఐఎల్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇది  సంస్థ  వ్యాపారవృద్ధికి దోహదపడుతుందన్నారు.  
కాగా  సాధారణంగా ఐటీ, ఈ కామర్స్ రంగాల్లో ఈ  పద్ధతి అమల్లో ఉంది.  టాప్ లెవల్ ఉద్యోగుల రాజీనామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు వెలుగులోకి వస్తాయని మార్కెట్ వర్గాల భావిస్తున్నాయి. గత రెండేళ్లకాలంలో ఆర్ఐఎల్  ఉన్నతోద్యోగులు సంస్థకు రాజీనామా చేయడం ఈ పథకానికి దారి తీసి వుండొచ్చని అంచనా వేశారు.

 

మరిన్ని వార్తలు