జియో ఉద్యోగులకు ఫెస్టివల్ గిప్ట్

6 Oct, 2016 09:26 IST|Sakshi
జియో ఉద్యోగులకు ఫెస్టివల్ గిప్ట్
కోల్కత్తా : రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ జియో ఇన్ఫోకామ్ తన ఉద్యోగులకు పండుగ కానుకలు తీసుకొచ్చింది. ఉత్తమమైన ప్రతిభ కనబర్చి 4జీ నెట్వర్క్ ఆపరేషన్స్ను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలను 15 శాతం పెంచింది. పనితీరు బాగున్న జూనియర్, మధ్యశ్రేణి ఉద్యోగులకు ఈ వేతనాలు పెరిగినట్టు కంపెనీకి చెందిన ఒకరు చెప్పారు. అదేవిధంగా ఉన్నతస్థాయి పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, డీజీఎమ్ స్థాయి వారికి కూడా ప్యాకేజీ 10 శాతం ఎగిసినట్టు వెల్లడించారు. నెట్వర్క్స్/నెట్వర్క్స్ ఐటీ అండ్ సపోర్టు, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్, ప్రాజెక్టు, హెచ్ఆర్, రెగ్యులేటరీలో పనిచేసే వారు ఈ వేతనాల ఇంక్రిమెంట్ లబ్దిపొందనున్నట్టు చెప్పారు. 
 
వార్షిక ఇంక్రిమెంట్ కింద తమ జూనియర్, మిడిల్ స్థాయి ఉద్యోగులకు 7 శాతం నుంచి 15 శాతం వేతనాలను పెంచనున్నట్టు జియో గతేడాది చివర్లోనే ప్రకటించింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్-మే నుంచి ఉద్యోగులకు అందుతాయని తెలిపింది. కానీ ఆ పెంపు కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ వేతనాలను రిలయన్స్ జియో పెంచినట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉద్యోగులు అందుకుంటున్న వార్షిక ఇంక్రిమెంట్స్  ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా బాగున్నాయని ఓ ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ చెప్పింది. గతనెలలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తూ 4జీ సేవలను లాంచ్ చేసింది. కానీ ఆ సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఉన్నత స్థాయి ఉద్యోగులు కొంతమంది కంపెనీకి రాజీనామా చేశారు.  కానీ వారి రాజీనామాలకు సరియైన కారణాలు తెలియరాలేదు.
మరిన్ని వార్తలు