'హ్యాపీ న్యూ ఇయర్' లో జియోకు తిప్పలు

27 Dec, 2016 17:59 IST|Sakshi
'హ్యాపీ న్యూ ఇయర్' లో జియోకు తిప్పలు

ముంబై: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రిలయన్స్  జియో ఇన్ఫోకామ్ తాజా ఫ్రీ ఆఫర్లపై వివరణ  ఇవ్వాల్సిందిగా కోరింది. జియో 90 రోజుల  ఉచిత డేటా మరియు వాయిస్ ఆఫర్ పొడిగింపు  తాజా నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని అడిగింది.  ఈమేరకు జియోకు వారం క్రితం  లేక  పంపించామని, త్వరలోనే జవాబును ఊహిస్తున్నామని ట్రాయ్ సీనియర్అధికారి  వెల్లడించారు.  ఈ విషయాలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు.  ముకేష్ అంబానీ నేతృత్వంలో జియోను  ప్రమోషన్  ఆఫర్ పై వివరాలు తెలియజేయాల్సిందిగా  డిసెంబర్20న లెటర్ పంపించామని  అయిదురోజుల్లో వారి స్పందన రావాల్సి ఉందని   చెప్పారు.  డాటా ఆఫర్ లో  స్వల్ప మార్పు తప్ప పాత ఆఫర్ కు  పొడిగింపుగానే  జియో కొత్త ఆఫర్  ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా  ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని   ఆ అధికారి తెలిపారు.  

మరోవైపు  రిల‌య‌న్స్ జియోకు తాజా ఆఫర్ కు వ్య‌తిరేకంగా భార‌తీ ఎయిర్‌ టెల్ ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించింది. ‘వెల్‌ క‌మ్ ఆఫ‌ర్’ ముగిసిన త‌ర్వాత కూడా ‘ఉచిత ఆఫ‌ర్’ కొన‌సాగింపునకు ఎలా అనుమ‌తి ఇచ్చారంటూ ట్రాయ్‌ ను నిల‌దీసింది. ఈ మేర‌కు టెలికం వివాదాల ప‌రిష్కార ట్రిబ్యున‌ల్‌ ను ఆశ్ర‌యించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న రిల‌య‌న్స్ జియోకు ట్రాయ్ వంత‌పాడుతోంద‌ని ఆరోపించింది.

కాగా ఈ ఏడాది సెప్టెంబర్ నుండి మూడు నెలల పాటు  అందుబాటులోకి తెచ్చిన ఉచిత డేటా మరియు వాయిస్ కాల్స్  సేవలు  డిసెంబర్ 3 న ముగియనుండగా డిసెంబర్ 1 న 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'  ప్రకటించింది జియో. మార్చి 2017 వరకు పొడిగించిన ఈ ఆఫర్ ను  పొడిగించింది. గతంలో రిలయన్స్ జియో 90 రోజుల ఉచిత సర్వీసులపై కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా, ఇతర టెలికాం కంపెనీలఆరోపణలను  తోసిపుచ్చిన ట్రాయ్ జియోకు క్లీన్ చిట్  ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.