రూ.4 లక్షల లోపు కారుపై రెనాల్ట్ దృష్టి

21 Nov, 2013 00:36 IST|Sakshi

టోక్యో: భారత మార్కెట్లో రూ. 4 లక్షల లోపు ధర ఉండే కారును ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నట్లు ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ చైర్మన్ (ఆసియా పసిఫిక్ ప్రాంతం) గిలెస్ నార్మండ్ తెలిపారు. భారత్‌లో అమ్ముడయ్యే కార్లలో ఈ శ్రేణి కార్ల వాటా 40 శాతం పైగానే ఉంటోందని ఆయన టోక్యోలో జరుగుతున్న మోటార్‌షోలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అలాగే మల్టి యుటిలిటీ వెహికల్ (ఎంయూవీ) సెగ్మెంట్‌పైనా కసరత్తు చేస్తున్నామని నార్మండ్ వివరించారు. ఈ ఏడాది అమ్మకాల్లో 90 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది 35,000 వాహనాలు విక్రయించగా, ఈసారి సుమారు 65,000-66,000 మేర అమ్మకాలు ఉండగలవని తెలిపారు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) డస్టర్ విక్రయాలు తగ్గుతుండటంపై మాట్లాడుతూ.. ఏదైనా కొత్త మోడల్ ప్రవేశపెట్టినప్పుడు ప్రారంభంలో స్పందన భారీగా ఉండి తర్వాత ఒక స్థాయిలో స్థిరపడుతుందని, డస్టర్ విషయంలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోందని చెప్పారు. అమ్మకాలు పెంచుకునేందుకు డస్టర్‌లో కొత్త వేరియంట్స్‌ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు.
 
 త్వరలో హోండా నుంచి 3 కొత్త కార్లు
 జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖర్లోగా భారత మార్కెట్లో 3 కార్ల మోడల్స్‌ని ప్రవేశపెట్టనుంది. ఇందులో మల్టీపర్పస్ వెహికల్(ఎంపీవీ) మొబీలియో కూడా ఉంటుందని కంపెనీ భారత విభాగం ప్రెసిడెంట్ యోషియుకి మత్సుమోటో తెలిపారు. అలాగే, చిన్న కారును కూడా పూర్తి స్థాయిలో తయారు చేయడంపైనా దృష్టి సారిస్తున్నట్లు టోక్యో మోటార్ షోలో ఆయన వివరించారు. కొత్త మోడల్స్‌తో రాబోయే మూడేళ్లలో భారత్‌లో 3 లక్షల కార్ల విక్రయం తమ లక్ష్యమని మత్సుమోటో చెప్పారు.

మరిన్ని వార్తలు