గులాబీ నేతల్లో రిజర్వేషన్ గుబులు

26 Sep, 2015 01:26 IST|Sakshi
గులాబీ నేతల్లో రిజర్వేషన్ గుబులు

మార్కెట్ కమిటీ కోటాపై అసంతృప్తి సెగలు
తమ పదవులకు ముప్పు అంటున్న నాయకులు
పనిచేసిన వారికి పదవులు దక్కని వైనం
నామినేటెడ్ పదవుల పంపకంలో హంసపాదు

సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీలో అధికార టీఆర్‌ఎస్‌కు ఆదిలోనే హంసపాదు పడిందా? ఆయా వర్గాలకు రాజకీయ భరోసా కల్పించేందుకు తీసుకున్న ‘రిజర్వేషన్’ నిర్ణయం బెడిసి కొట్టనుందా?

దీనికి అవుననే జవాబిస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 168 వ్యవసాయ మార్కెట్లకు గాను గిరిజన ప్రాంతాల్లోని 13 మినహా, 168 మార్కెట్ కమిటీల భర్తీ కోసం ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం (84 మార్కెట్లు) రిజర్వేషన్ ఇవ్వగా, 84 మార్కెట్లను జనరల్ కేటగిరీలో ఉంచింది.

బీసీలకు 49, ఎస్సీలకు 25, ఎస్టీలకు 10 చొప్పున రిజర్వు అయిన మార్కెట్లు అధికార పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. రిజర్వేషన్ల వల్ల అసలు రావాల్సిన వారికి పదవులు రాకుండా పోయే ముప్పుందని నేతలు వాపోతున్నారు. పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం నామినేటెడ్ పదవులపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు.
 విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొందరు నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం జిల్లా అధ్యక్షుడిని, తమ ఎమ్మెల్యేలను, జిల్లా మంత్రిని నమ్ముకున్నారు.

కొన్ని జిల్లాల్లో సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుకున్న విధంగానే వారి వారి నియోజకవర్గాల్లో అనుకూలంగా రిజర్వు అయ్యాయని అంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలు అయినవారు, ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన వారు, కార్యకర్తలతో పెద్దగా సంబంధాలు లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం రిజర్వేషన్ కోటాను పూర్తి చేసేందుకు చిత్తమున్నట్లు కేటాయించారన్న అభిప్రాయం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లకు చెక్ పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు.

నెల రోజుల కిందటే ఏ మార్కెట్ చైర్మన్ పోస్టు ఏ వర్గానికి ఇవ్వాలో ఖరారైందని సమాచారం. ఈనెల 22న టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ లో రిజర్వేషన్ల జాబితాను ఎమ్మెల్యేలకు ఇచ్చారని చెబుతున్నారు. వీటిలో సుదీర్ఘంగా పార్టీలో ఉన్న వారికి అవకాశం దక్కకుండా పోయిన సెంటర్లు చాలానే ఉన్నాయని తెలుస్తోంది.
 
ఉదాహరణకు ఒక్క ఎస్టీ రిజర్వేషన్‌ను పరిశీలిస్తే, ఎస్టీ జనాభా అత్యధికంగా ఉండే నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ కమిటీ జనరల్ కోటాలో ఉంటే, పార్టీలో నామినేటెడ్ పోస్టు ఇవ్వడానికి అర్హుడైన నేత లేని భువనగిరి మార్కెట్ ఎస్టీలకు రిజర్వు అయ్యింది. ఎస్సీలు అధికంగా ఉండే నకిరేకల్ ఎస్టీలకు, బీసీ నేతలు ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మిర్యాలగూడ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఎస్టీలకు 10 మార్కెట్లు రిజర్వు అయితే, నల్లగొండ జిల్లాలోనే నాలుగు కేటాయించారు.

ఇక ఎస్సీలకు 25 మార్కెట్లు రిజర్వ్ చేస్తే 12 మార్కెట్లు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అసలు ఎస్సీలకు ఒక్క మార్కెట్‌నూ కేటాయించలేదు. కొందరు మంత్రులు చక్రం తిప్పిన చోట్ల జనరల్ కోటాకు ఎక్కువ కేటాయింపులు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు