ఆర్‌బీఐవైపే మార్కెట్ చూపు

29 Jul, 2013 03:35 IST|Sakshi
markets

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లను రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు కూడా ఇండెక్స్‌ల నడకను నిర్ణయించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి పాలసీ సమీక్షను ఆర్‌బీఐ ఈ నెల 30న (మంగళవారం) చేపట్టనుంది. ఇక మరోవైపు జూన్ క్వార్టర్‌కు ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్ సహా ఎన్‌టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ ఈ వారంలో ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. కొంతకాలంగా వ డ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరుగుతూ వచ్చినప్పటికీ, ఇటీవల ఆర్‌బీఐ రూపాయి విలువ పతనాన్ని నిలువరించే బాటలో బ్యాంకు రేటు తదితరాలను ఏకంగా 2% మేర పెంచింది. లిక్విడిటీ కట్టడిపై దృష్టిపెడుతూ రూ. 25,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను విక్రయించింది కూడా. వెరసి తాజా సమీక్షలో కీలక  పాలసీ రేట్లలో మార్పులు చేపట్టకపోవచ్చునని అత్యధికులు అంచనా వేస్తున్నారు.
 
 పాలసీ సమీక్ష కారణంగా స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణికే కట్టుబడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రూపాయి కదలికలు, విదేశీ పెట్టుబడులు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని తెలిపారు. సమీప కాలంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 5,870 పాయింట్లస్థాయి కీలకంగా నిలవనున్నదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్   సమావేశానికి సంబంధించిన అంశాలు కూడా సెంటిమెంట్‌కు కీలకంకానున్నాయని  చెప్పారు. కాగా, 4 వారాల అప్‌ట్రెండ్‌కు బ్రేక్ వేస్తూ గడిచిన వారంలో సెన్సెక్స్ 402 పాయింట్లు పతనమైంది. ఇందుకు ఆర్‌బీఐ లిక్విడిటీ కఠిన చర్యలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల నిరుత్సాహకర ఫలితాలు కారణమయ్యాయి.
 
 ఎఫ్‌ఐఐల పెట్టుబడులు వెనక్కి
 దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) 300 కోట్ల డాలర్ల(రూ. 18,500 కోట్లు) పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతోపాటు, ఫెడరల్ రిజర్వ్ పాలసీపై ఆందోళనలు ఇందుకు కారణంగా నిలిచాయి. డెట్ మార్కెట్ల నుంచి ఈ నెల 26 వరకూ రూ. 12,081 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకోగా, ఈక్విటీ మార్కెట్లలో రూ. 6,934 కోట్ల షేర్లను నికరంగా విక్రయించారు.

>
మరిన్ని వార్తలు