ప్రమాణాల పెంపునకే ఆ నోట్లు వెనక్కి..

24 Jan, 2014 01:07 IST|Sakshi
ప్రమాణాల పెంపునకే ఆ నోట్లు వెనక్కి..

 న్యూఢిల్లీ: 2005 సంవత్సరానికి ముందు జారీచేసిన అన్ని కరెన్సీ నోట్లనూ ఉపసంహరించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు గానీ లేదా చెల్లుబాటుకు వీలులేకుండా చేయడంగానీ ఈ నిర్ణయం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కేవలం కరెన్సీ భద్రతా ప్రమాణాలను పెంచేందుకే  ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. 2005కు ముందు జారీ చేసిన నోట్ల చెల్లుబాటు కొనసాగుతుందని కూడా ఉద్ఘాటించారు. ఆర్‌ఎన్ రావు స్మారక ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు.  సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘కరెన్సీ ఉపసంహరణ నిర్ణయం’ ప్రాధాన్యత ఏమిటో తెలపాలని అంతకుముందు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అడిగిన ఒక ప్రశ్నకు రాజన్ సమాధానం చెప్పారు. ‘ఈ నిర్ణయంపై ప్రజలు విభిన్న అర్ధాలను తీసుకుంటున్నారు. అయితే ఎన్నికలకుకానీ, చెలామణిలో నుంచీ 2005 ముందు కరెన్సీ నోట్లను తొలగించాలన్న ఉద్దేశం కానీ ఇందులో లేదు’ అని వివరించారు.  రూ.500, రూ.వెయ్యి నోట్లతో సహా 2005కు ముందు జారీచేసిన అన్ని పాత నోట్లనూ వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరిస్తామని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది.
 
 ద్రవ్యోల్బణం... వినాశన వ్యాధి
 ద్రవ్యోల్బణాన్ని ‘వినాశన వ్యాధి’గా పేర్కొన్నారు. దీని కట్టడి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆహార ఉత్పత్తుల వినియోగం అధికం కావడం వల్లే ధరలు పెరిగిపోతున్నాయని గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ సందర్భంగా అన్నారు. దీనికి వ్యవసాయం, సేవల రంగాలు కూడా ఇందుకు ఒక కారణమని వివరించారు.
 
 బంగారంపై ఏమన్నారంటే..
 మన దేశంలో గృహస్తులు బంగారంవైపు చూడ్డానికి కారణం- ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రమెంట్లు ఆకర్షణీయంగా లేకపోవడమేనని రాజన్ వివరించారు.
 

మరిన్ని వార్తలు