రిషితేశ్వరి మృతిపై విచారణ, 5 రోజుల్లో నివేదిక

30 Jul, 2015 04:07 IST|Sakshi
రిషితేశ్వరి మృతిపై విచారణ, 5 రోజుల్లో నివేదిక

గుంటూరు: రిషితేశ్వరి మృతిపై బుధవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా నలుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ విచారణ కమిటీ నాగార్జున వర్సిటీకి చేరుకుంది. మూడు రోజుల పాటు యూనివర్సిటీలోనే ఉండి విచారణ జరపనున్నారు. అయితే ఈ రోజు పూర్తిగా అధికారులతోనే కమిటీ సభ్యులు సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. రిషితేశ్వరి ఘటన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నామని విచారణ కమిటీ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

పోలీసులు, విద్యార్థులు, విద్యార్థి నేతలతో కూడా తామ ప్రత్యేక్యంగా మాట్లాడుతామన్నారు. ఎవరైనా బహిరంగంగా విచారణకు హాజరైనాసరే లేదంటే ఇన్కెమెరా విచారణకు హాజరవుతామని తెలిపినా అభ్యంతరం లేదని చెప్పారు. ఈ రోజంతా వర్సిటీ అధికారులతో మాట్లాడి రేపు విద్యార్థులతో విచారణ జరుపుతామని అన్నారు. మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చేవారికి తమ మెయిల్ అడ్రస్ చెబుతామని తెలిపారు. కాగా, ఐదురోజుల్లో తాము ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రిషితేశ్వరి మృతిపై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించడం లేదని సమాచారం.

రిషితేశ్వరి ఉదంతంలో సమాధానం లేని ప్రశ్నలు...
1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు?
2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది?
3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4. బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు?
5. హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు?
6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని?
7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు?
8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు?
9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు?
10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది?
11.ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది?
12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు?

మరిన్ని వార్తలు