అక్కడ నివాసం ఉంటేనే స్థానికత

20 Jun, 2016 19:48 IST|Sakshi

- ఎమ్మార్వో సర్టిఫికెట్ ఇస్తారు
- సీఎస్‌కు చేరిన ఫైలు
- నేడో రేపో మార్గదర్శకాలు


హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లి అక్కడ నివాసం ఉంటేనే స్థానికత కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలతో కూడిన ఫైలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. స్థానికతకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి.

రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి అంటే 2014 సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి 2017 సంవత్సరం జూన్ 2వ తేదీలోగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది.

2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానిక సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తు ఆధారంగా పరిశీలన చేసి అక్కడే నివాసం ఉంటే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా జారీ చేయనున్నారు. ఉద్యోగులకే కాకుండా అక్కడికి తరలివెళ్లే ఎవరికైనా స్థానికత కల్పించనున్నారు.

ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వెళితే అతనికి స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు హైదరాబాద్‌లోనే స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో జూన్ 2, 2017లోగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడకు తరలివెళ్లినా స్థానికత వర్తిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మాత్రమే మార్గదర్శకాలను రూపొందించారు.

మరిన్ని వార్తలు