పచ్చ చొక్కాలకే ఎఫ్‌ఏ పోస్టులు!

25 Aug, 2015 02:14 IST|Sakshi
పచ్చ చొక్కాలకే ఎఫ్‌ఏ పోస్టులు!

ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగింత  
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్ల(ఎఫ్‌ఏ)ను మూకుమ్మడిగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఆ స్థానాల్లో కొత్తగా చేపట్టే నియామకాలకు రాజకీయ రంగు పులుముతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన వారిని అధికారులు ఎంపిక చేస్తారు. కానీ, చంద్రబాబు పాలనలో ప్రభుత్వ శాఖలో పనిచేసే వారిని ఎంపిక చేయాల్సిన బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు.

ఈ కమిటీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సభ్యులుగా నియమించారన్న ఆరోపణలున్నాయి. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. 1,660 గ్రామాల్లో కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పది రోజులల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ)లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డులో ఉంచుతారు.

దరఖాస్తు చేసుకున్న వారి లో ముగ్గురి పేర్లను టీడీపీ కార్యకర్తలతో కూడిన గ్రా మ జన్మభూమి కమిటీ ఎంపిక చేస్తుంది. ఎంపీడీవో ద్వారా ఆ వివరాలను జిల్లా పీడీలకు పం పుతారు. కమిటీ సభ్యులు సూచించిన ముగ్గురిలో ఒకరిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా పీడీ నియమిస్తారు. ఈ విధానం వల్ల టీడీపీ నేతల అనుచరులే ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యే అవకాశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
సీఎం కార్యాలయ పర్యవేక్షణలో
గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, వారి స్థానంలో కొత్త నియామకాలపై ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి నిరంతరం గ్రామీణాభివృద్ధి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాల వారీగా ఎంత మందిని తొలగించారు, కొత్తగా ఎంతమందిని నియమించారంటూ ప్రతిరోజూ ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు