ఆర్బీఐకు మరో ఛాన్స్: దిగొచ్చిన ద్రవ్యోల్బణం

13 Oct, 2016 20:54 IST|Sakshi
ఆర్బీఐకు మరో ఛాన్స్: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : మరోసారి రిజర్వు బ్యాంకు ఆఫ్ రేట్ల కోతకు అవకాశం కల్పిస్తూ, రిటైల్ ద్రవ్యోల్బణం చల్లటి కబురు అందించింది. ఆహార ఉత్పత్తుల ధరలు కిందకి దిగి రావడంతో సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31శాతంగా నమోదై 13 నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు వెల్లడైంది.  ఆగస్టు నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.05శాతంగా ఉంది. వరుసగా రెండు నెలల పాటు ఈ ద్రవ్యోల్బణం పడిపోయినట్టు ప్రభుత్వ అధికారిక డేటా ప్రకటించింది. వినియోగదారుల ధరలకు అనుగుణంగా ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. గత నెల 5.91శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఆశ్చర్యకరంగా 3.88శాతానికి దిగిజారినట్టు వెల్లడైంది. 2016-17 ఆర్థిక సంవత్సంలో మొదటిసారి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 5 శాతం కంటే తక్కువగా నమోదకావడం విశేషం. 
 
అయితే ఈ ద్రవ్యోల్బణంలో చక్కెర, మిఠాయి ధరలు మరింత ప్రియంగా మారి, 25.77శాతంగా రికార్డు అయ్యాయి. పప్పుల ద్రవ్యోల్బణం 14.33 శాతంగా, దుస్తులు,ఫుట్వేర్ ద్రవ్యోల్బణం 5.19శాతం, ఇంధన ద్రవ్యోల్బణం 3.07శాతంగా ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణం 5 శాతం కంటే కిందకి పడిపోవడం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్యవిధాన కమిటీకి మరోసారి రేట్ల కోతకు అవకాశం కల్పిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. 50 బేసిస్ పాయింట్లు వరకు ఈ ఏడాది రేటుకు కోత పడుతుందని అంచనావేస్తున్నారు. కిందటి పాలసీలో కూడా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని కమిటీ మార్కెట్ విశ్లేషకులకు ఆశ్చర్యకరంగా రేటు కోత ప్రకటిస్తూ దీపావళి కానుక అందించారు. అంచనావేసిన దానికంటే ఎక్కువగా పారిశ్రామికోత్పత్తి పడిపోయినట్టు డేటా విడుదలైన తర్వాతి రోజే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్టు వెల్లడైంది. 
మరిన్ని వార్తలు