వయో పరిమితిపై సీలింగ్

6 Sep, 2015 02:04 IST|Sakshi
వయో పరిమితిపై సీలింగ్

- రిటైరయ్యే వయసులో పరీక్ష రాస్తారా..!
- సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీఎస్‌పీఎస్‌సీ
- త్వరలోనే సవరణ ఉత్తర్వుల జారీకి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు పోటీపడే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి పెంచడం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. సర్వీసులో ఉన్న వికలాంగ ఉద్యోగులు ఏకంగా రిటైరయ్యాక పోటీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విచిత్ర పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో తలెత్తిన గందరగోళ పరిస్థితిని సవరించాల్సిన అవసరాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తించింది. సాధారణ గరిష్ట వయో పరిమితి పెంచినప్పటికీ.. సర్వీసు రూల్స్ ప్రకారం ఉన్న మిగతా కేటగిరీలకు ఉన్న సడలింపులపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో తలెత్తిన గందరగోళాన్ని నివారించేందుకు వయో పరిమితిపై సీలింగ్ విధించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు రిటైర్ అయ్యేలోపు కనీసం మూడేళ్ల నుంచి అయిదేళ్ల పాటు సర్వీసులో ఉండాలని.. లేకుంటే ఎంపికైన అభ్యర్థి ఏడాది రెండేళ్లలోనే రిటైరైతే మళ్లీ ఆ పోస్టును భర్తీ చేసుకోవాల్సిన అనుచిత పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అధికారులతో చర్చించారు. అవసరమైతే ఈ మేరకు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌ను తెలంగాణకు అనుగుణంగా మార్చుకోవటంతో పాటు వయో పరిమితి మినహాయింపులను సవరించాలని ఆదేశాలు జారీ చేశారు.
 
అసలు చిక్కు ఎక్కడుంది..?
సాధారణ అభ్యర్థుల వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా అయిదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఏ ళ్లు.. వికలాంగులకు 54 ఏళ్ల వరకు వయో పరిమితి వర్తించనుంది. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు మరో అయిదేళ్ల పాటు పరీక్షలు రాసేందుకు అర్హులవుతారు. దీంతో వికలాంగులైనఉద్యోగులు ఏకంగా 59 ఏళ్ల వయస్సు వర కు పరీక్షలకు హాజరు కావచ్చు. కానీ  రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉండటం గమనార్హం. అందుకే ఈ అయోమయానికి తెరదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడో రేపో అందుకు అనుగుణంగా సవరణ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు