'ఆదాయం పెరిగింది, వడ్డీ రేట్లు తగ్గాయి'

6 Nov, 2015 11:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆర్థిక సదస్సు-2015ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జామ్(జన్ ధన్, ఆధార్, మొబైల్) విజన్ లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.

జన్ ధన్ యోజన కింద బ్యాంకుల్లో మొత్తం 26 వేల కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. 17 నెలల తమ పాలనలో 190 మిలియన్ల మందిని బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేశామని చెప్పుకొచ్చారు. సంస్కరణలతో ప్రత్యేకించి పేదలకు మేలు జరుగుతుందన్నారు. భారత వ్యాపారం సామర్థ్యం విస్తరించాలని అభిప్రాయపడ్డారు.

జీడీపీ, ఎఫ్ డీఐలలో పెరుగుదల నమోదైందని తెలిపారు. దవ్యోల్బణం, సీఏడీలో తగ్గుదల కన్పిస్తోందన్నారు. ఆదాయం పెరిగిందని, వడ్డీ రేట్లు తగ్గాయని... రూపాయి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. సంస్కరణలు అనేవి స్వల్పకాలికం కాదని, దీర్ఘకాలం కొనసాగుతాయని అన్నారు.
 

మరిన్ని వార్తలు