కోవిద్... లక్ష్యాన్ని చేరుకో ఇలా

10 May, 2015 01:31 IST|Sakshi
కోవిద్... లక్ష్యాన్ని చేరుకో ఇలా

కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమయ్యింది. మనలో చాలామంది కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గతేడాదిలా కాకుండా ఈ ఏడాది నుంచి చక్కటి ఆర్థికప్రణాళికతో వెళ్ళాలనుకుంటారు. అదే విధంగా ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే కోవిద్‌కు కూడా చక్కటి ఆర్థిక ప్రణాళికతో తన లక్ష్యాలను చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని సంప్రదించాడు . కోవిద్ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి సూచించిన ఆర్థిక ప్రణాళిక వివరాలను రైట్ హొరెజైన్స్ సీఈవో అనిల్ రెగో మాటల్లోనే తెలుసుకుందాం..
 
 ముపైయవ పడిలో ఉన్న కోవిద్ నెల జీతం రూ. 55,000. ఇందులో ఇంటి అవసరాలకు రూ. 35,000 పోగా నెలకు రూ. 20,000 వరకు దాచుకోగలడు. ఇంటి బాధ్యతలు దృష్ట్యా భారీ స్థాయిలో రిస్క్ చేసే సామర్థ్యం లేదు. ప్రస్తుతం కోవిద్‌కు ప్రధానంగా మూడు లక్ష్యాలున్నాయి. అవి.. అతిపెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీ కొన డం, యూరప్ దేశాలకు విహార యాత్రలకు వెళ్ళడం, సొంతింటిని నిర్మించుకోవడం. ఈ లక్ష్యాలను వరుసగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలుగా పేర్కొనవచ్చు.
 
 ఇలా చేద్దాం..
 ఇక కోవిద్ ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి ప్రణాళికలు సూచించే ముందు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో మధ్య స్థాయి రిస్క్ మాత్రమే చేసే సామర్థ్యం ఉండటంతో అధిక రిస్క్ ఉండే షేర్లను కొనడాన్ని సూచించలేము. మరో అంశం వయస్సు. ఇతని వయస్సు ఇంకా ముఫ్పై మధ్యలో ఉండటంతో మ్యూచువల్ ఫండ్ వంటి వాటిని సూచించవచ్చు. ఈ అంశాలన్నీ పరిగణనలోనికి తీసుకొని కోవిద్ ప్రతి నెలా సేవింగ్ చేసే మొత్తంలో 25 శాతం డెట్ పథకాలు, 10 శాతం గోల్డ్ ఫండ్స్‌కి కేటాయించి మిగిలిన 65 శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నా. ఈ పోర్ట్‌ఫోలియో ద్వారా కోవిద్.. తన లక్ష్యాలన్నింటినీ సులభంగా చేరుకోవచ్చు.
 
 ‘సిప్’ మార్గమే బెస్ట్
 పైన సూచించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) మార్గం బాగుంటుంది. రూ. 20,000ను ప్రతి నెలా డెట్ పథకాల్లో రూ. 5,000, గోల్డ్ ఫండ్‌లో రూ. 2,000, ఈక్విటీ ఫండ్స్‌లో రూ. 13,000 సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతీ విభాగంలోను అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి పనితీరు కనపరుస్తున్న వాటిని ఎంచుకొని వాటిలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మొదటి సంవత్సరం కోవిద్ రూ. 2.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. 3 రకాల విభిన్నమైన అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయ డంతో ఏటా 15% రాబడిని ఆశించవచ్చు. దీంతో మొదటి ఏడాదిలోనే తొలి లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలడు. ఆ తర్వాత రెండు మూడేళ్లకే విదేశీ యాత్ర కలను నిజం చేసుకోవచ్చు. కోవిద్.. ఇదే విధంగా 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ.. దీనిపై 15% వార్షిక రాబడిని అంచనా వేస్తే కోవిద్ సంపద విలువ రూ. 66 లక్షలు దాటుతుంది.
 
 బీమా ముఖ్యమే..
 వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు, వైద్య ఖర్చులు పెరుగుతాయి... కాబట్టి బీమా రక్షణ అనేది చాలా కీలకం. చిన్న వయసులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమాను తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే వీటిని పొందవచ్చు. వార్షిక జీతానికి కనీసం 10 రెట్లు అధికంగా ఉండే విధంగా జీవిత బీమా తీసుకోండి. ఇక్కడ కోవిద్ విషయానికి వస్తే కనీసం రూ. 60 లక్షలు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. జీవితంలో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అతని కుటుంబానికి బీమా ఆర్థిక రక్షణను ఇస్తుంది.
 
 లోన్‌తో కట్టుకుందాం..
 ఇక మూడవ లక్ష్యం సొంతింటి నిర్మాణం విషయానికి వస్తే.. ఈ కలను గృహరుణం ద్వారా తీర్చుకోమని సూచిస్తాను. మొత్తం డబ్బులు సమకూర్చుకొని ఇంటిని కొనుగోలు చేసే బదులు, రుణం తీసుకొని నిర్మించుకోవడం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. సెక్షన్ 24 కింద చెల్లించే వడ్డీపై ఏటా రెండు లక్షలు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఇప్పటికే పన్ను పరిధిలో ఉన్న కోవిద్‌కు ఇది ఊరటనిస్తుంది.
 
 ఫ్యామిలీ బడ్జెట్
 బడ్జెట్తయారు చేసుకొని దాని ప్రకారం ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.
 మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పన్ను ప్రయోజనాలుండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.
 మొత్తం సొమ్మును ఒకేసారిగా కాకుండా సిప్ విధానాన్ని ఎంచుకోండి.
 పన్ను భారం తగ్గించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను సాధ్యమైనంతగా వినియోగించుకోండి.

 

మరిన్ని వార్తలు