విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ.11,718 కోట్లు

5 Apr, 2015 01:17 IST|Sakshi
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ.11,718 కోట్లు

 సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్ గత ఆర్థిక సంవత్సరంలో ఉక్కు ఉత్పత్తిలో 3 శాతం వృద్ధి నమోదు చేసిందని స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీ మధుసూదన్ తెలిపారు. దేశీయ మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ... చైనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి తక్కువ ధరకు డంపింగ్ జరుగుతున్న పరిస్థితుల్లో సైతం రూ.11,718 కోట్లు టర్నోవర్ సాధించిందన్నారు. ఉక్కు యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన గత ఆర్దిక సంవత్సరంలో స్టీల్‌ప్లాంట్ సాధించిన ప్రగతిని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా  రూ.868 కోట్లు విలువైన ఎగుమతులు చేసి అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే 16 శాతం వృద్ది నమోదు చేశామన్నారు.
 
  వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా గత ఏడాదిలో 24రకాల కొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేకంగా ఈ ఏడాది మార్చిలో హాట్ మెటల్, లిక్విడ్ స్టీల్, సేలబుల్ స్టీల్ ఉత్పత్తిలో గతంలో ఎన్నడు లేని విధంగా  రికార్డులను నమోదు  చేసామన్నారు. 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఈ నెలలో స్పెషల్ బార్ మిల్   పూర్తి కానుండగా, మే నెల చివరి నాటికి స్ట్రక్చరల్ మిల్ పూర్తయ్యేలా పనులు సాగుతున్నాయన్నారు. బ్లాస్ట్‌ఫర్నేస్‌ల ఆధునీకరణ, ఎస్‌ఎంఎస్ కన్వర్టర్‌ల రీవాంపింగ్ ద్వారా ఉత్పత్తి సామర్ద్యం మరింత పెరగనున్నదన్నారు.
 

మరిన్ని వార్తలు