'షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు'

4 Sep, 2015 09:54 IST|Sakshi
'షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు'

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇస్తే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... తామిచ్చిన తీర్మానంపై టీడీపీ నేతలు షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ కేసు కోర్టులో ఉన్నందున చర్చించబోమని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. కోర్టులో ఉన్న వైఎస్ జగన్ కేసుల గురించి టీడీపీ నాయకులు ప్రతిరోజు మాట్లాడుతుంటే స్పీకర్ మౌనంగా ఉండడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసు తెలంగాణ సంబంధించిందని అంటున్నారని... అలాంటప్పుడు మత్తయ్యకు ఏపీ ప్రభుత్వం ఎందుకు రక్షణ ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసుతో ఏపీకి సంబంధం ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

ఆడియోలో ఉన్న 'వ్యాట్ అయామ్ సేయింగ్' వాయిస్ మీదా, కాదా చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి  బయటపడే మార్గాలు అన్వేషించేందుకు 15 సార్లు డీజీపీతో చంద్రబాబు భేటీ అయ్యారని తెలిపారు. రిషితేశ్వరి, వనజాక్షి కేసులో ఎన్నిసార్లు పోలీసులతో సమావేశమయ్యారని ప్రశ్నించారు. బ్రీఫిడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యంవుంటే 'ఓటుకు కోట్లు'పై చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలు