ఇప్పటికి ఎన్ని చుక్కల నీరిచ్చారు?

2 Sep, 2015 16:23 IST|Sakshi
ఇప్పటికి ఎన్ని చుక్కల నీరిచ్చారు?

పట్టిసీమ ఎత్తిపోతల సాకు చూపించి పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. పోలవరాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కోల్డ్ స్టోరేజిలో పడేసిందని, అసలు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు అనుకూలమా.. వ్యతిరేకమా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పట్టిసీమ పేరుతో జరుగుతున్న అవినీతికి తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల.. చంద్రబాబు అవినీతి మానసపుత్రిక అని విమర్శించారు. 22 శాతం అదనంగా టెండర్లు ఖరారుచేసి అవినీతికి పాల్పడింది వాస్తవామా.. కాదా అని నిలదీశారు.

ఆగస్టు 15వ తేదీన పట్టిసీమను జాతికి అంకితం చేశారని, ఇప్పటికి ఎన్ని చుక్కలు నీరిచ్చారో చెప్పాలని ఆమె ఎద్దేవా చేశారు. అసలు పంపులే లేకుండా ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తామని జీవోలో ఎక్కడైనా చూపించారా అని అడిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో మళ్లీ కరువు వచ్చిందని, కృష్ణా డెల్టాలో తీవ్ర సంక్షోభం నెలకొందని అన్నారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలంలో నీళ్లు అడుగంటిపోయాయని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు