రోహింగ్యాలు.. ఆ అభ్యంతరం ఎందుకు?

21 Sep, 2017 12:57 IST|Sakshi
రోహింగ్యాలు శరణార్థులు కాదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. దేశంలోని రోహింగ్యాలను మయన్మార్‌కు డీపోర్ట్‌ చేయాలన్న కేంద్రం వైఖరి మారబోదని ఆయన స్పష్టం చేశారు. 'రోహింగ్యాలు శరణార్థులు కాదు. వారు ఆశ్రయం కోరి దేశంలోకి రాలేదు. వారు అక్రమ వలసదారులు' అని ఆయన అన్నారు. రోహింగ్యాలను తిరిగి తీసుకోవడానికి మయన్మార్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొందరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

శరణార్థి హోదా పొందాలంటే ఒక ప్రక్రియ ఉంటుందని, ఈ ప్రక్రియను రోహింగ్యా వలసదారులు పాటించలేదన్నారు. 1951 ఐరాస శరణార్థి ఒప్పందంలో భారత్‌ సంతకం చేయలేదని, రోహింగ్యాలను మయన్మార్‌కు పంపడం ద్వారా భారత్‌ ఎలాంటి అంతర్జాతీయ ఒడంబడికను ఉల్లంఘించడం లేదని చెప్పారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పుగా మారరని, అందుకే వారిని మయన్మార్‌కు తరలించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు