బాబు ముందే జాగ్రత్తపడి.. ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్‌

15 Dec, 2016 04:39 IST|Sakshi
బాబు ముందే జాగ్రత్తపడి.. ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్‌
- మోదీ తల్లి వద్ద గల బంగారానికి రశీదు చూపించగలరా
- నిరక్షరాస్యత దేశంలో నగదు రహితం సాధ్యమా
- కొంతమంది పోలీసులు ఎన్టీఆర్‌ భవన్‌లో జీతాలు తీసుకుంటే మంచిది
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా ధ్వజం

నరసాపురం :
కేంద్రం నుంచి అందిన లీకేజీలతో పెద్దనోట్ల విషయంలో ముందే జాగ్రత్తపడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ అంశంపై పబ్లిసిటీ స్టంట్‌ మొదలెట్టారని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే చంద్రబాబు హెరిటేజ్‌ వాటాలను అమ్మేసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

అంతకు కొద్దిరోజుల ముందు పెద్దనోట్లు రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాయడం, ఇప్పుడు నగదు రహిత లావాదేవీలు, డిజిటల్‌ ఏపీ అంటూ ప్రచారాలు చేయడం అంతా డ్రామా అన్నారు. దేశంలో నూరుశాతం అక్షరాస్యత లేనప్పుడు, నూరుశాతం నగదు రహిత లావాదేవీలు ఎలా జరుగుతాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు రూ.2 వేల కోసం పనులు మానుకుని రోజంతా బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలకు బ్యాంకులతో సంబంధాలు లేవని అన్నారు. బ్యాంకింగ్‌ రంగాన్ని విస్తరించకుండా, నగదు రహిత లావాదేవీలపై ఎలాంటి అవగాహనా కల్పించకుండా డిజిటల్‌ ఇండియా, డిజిటల్‌ ఏపీ అనడంలో అర్థం లేదన్నారు. ఈత నేర్పి నదిలో దింపితే ఉపయోగం ఉంటుంది కానీ.. ప్రభుత్వాలు ప్రజలను సముద్రంలోకి తోసేసి ఈత నేర్చుకోమంటున్నాయని ధ్వజమెత్తారు.
 
మోదీ తల్లి బంగారానికి రశీదు చూపించగలరా
కేంద్రం బంగారంపై ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందని రోజా విమర్శించారు. వారసత్వంగా వస్తున్న బంగారానికి లెక్కలు ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. డబ్బుల కోసం తల్లిని ఏటీఎం ముందు నిలబెట్టిన  ప్రధాని మోదీ ఆమె వద్ద ఉన్న బంగారానికి రశీదు చూపించగలరా అని నిలదీశారు. నల్లధనం ఎక్కడుందో ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. అధికార పార్టీ నేతల వద్దే నల్లధనం ఉందన్నారు. టీటీడీ పాలకవర్గ సభ్యుడి రూ.70 కోట్ల కొత్తనోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అండ లేకుండా అది సాధ్యం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగల చేతికి తాళాలు ఇచ్చి, సామాన్యులను రోడ్డుమీదకు తెచ్చాయని విమర్శించారు.

ఎన్టీఆర్‌ భవన్‌లో జీతాలు తీసుకుంటే మంచిది
తుందుర్రు మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకింగా ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసులు దాడులు జరపడాన్ని రోజా తీవ్రంగా ఖండించారు. అన్యాయంపై నోరెత్తిన వారిపై తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను బౌన్సర్లుగా వాడుతోందని విమర్శించారు. కొందరు పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. అలాంటి వారు పసుపు చొక్కాలు వేసుకుని ఎన్టీఆర్‌ భవన్‌లో జీతాలు తీసుకుంటే మంచిదని సూచించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ ఆచం నియోజకవర్గ కన్వీనర్‌ కవురు శ్రీనివాస్, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌ వి.సాయిబాలపద్మ పాల్గొన్నారు.