రోల్స్ రాయిస్ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు

4 Mar, 2014 23:11 IST|Sakshi

న్యూఢిల్లీ: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో విమాన ఇంజిన్ల సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడం కోసం బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ రూ.600 కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై రక్షణ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇందులో నగదు లావాదేవీలన్నీ తవ్వి తీయాలని సీబీఐను కోరినట్లు రక్షణ శాఖ అధికారులు మంగళవారమిక్కడ తెలిపారు.

2007-11 మధ్య హాక్ శిక్షణ విమానాలు (ఏజేటీ), జాగ్వార్ యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్ల సరఫరాకు ఉద్దేశించిన ఈ ఒప్పదంపై అంతర్గతంగా విచారించిన హాల్ నిఘా విభాగం... కొన్ని ఆరోపణలను ధ్రువీకరించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు హాల్, ఇతర విభాగాల్లోని అధికారులకు ముడుపులు ముట్టాయని రూఢీ చేసింది.

ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్‌తో కుదిరిన గత ఒప్పందాలు, భవిష్యత్తు ఒప్పందాలపై, దళారుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తునకు రక్షణ మంత్రి ఆంటోనీ ఆదేశించారు. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు రోల్స్ రాయిస్‌తో ప్రస్తుత, భవిష్యత్ ఒప్పందాలన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు