రూ. 100 కోట్ల దొంగ దందా

17 Jan, 2016 13:04 IST|Sakshi
రూ. 100 కోట్ల దొంగ దందా

నల్లబజారుకు తరలుతున్న బొగ్గు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నల్లబంగారం నల్లబజారు పాలవుతోంది. అంతాఇంతా కాదు. రోజుకు రెండొందల టన్నులను దొంగలు కొల్లగొడుతున్నారు. ఏటా వంద కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. కదిలే రైలులోంచే బొగ్గును కాజేస్తున్నారు. కాసులకు కక్కర్తి పడిన ఇంటిదొంగలు బొగ్గు దొంగలకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ సిరులు కురిపించే సింగరేణి బొగ్గును బుక్కుతున్న తీరు. కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో కొన్నేళ్లుగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)-1 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), ఓసీపీ-3 గనుల నుంచి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)కి రోజూ సగటున 8 నుంచి 12 రేకుల బొగ్గు సరఫరా అవుతోంది.

అయితే, బొగ్గులోడుతో రైలు నెమ్మదిగా ఎన్టీపీసీకి వెళుతుండగా మార్గమధ్యంలోనే సుమారు 40 మంది దొంగలు యైటింక్లరుున్ కాలనీ, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయి బొగ్గును చోరీ చేస్తుంటారు. వీరు రైలు వ్యాగన్లలోకి ఎక్కి బొగ్గుపెళ్లను లోపలి భాగంలో చుట్టూ అమరుస్తారు. అల్లూరు నుంచి న్యూమారెడుపాక, లక్ష్మీపురం వరకు దారి మధ్యలోనున్న చెట్లపొదల  వద్దకు(బొగ్గు నిల్వ చేసే పాయింట్లు) రాగానే ఆ బొగ్గును కింద పడేస్తారు. ఆ వెంటనే ఆయా ప్రాంతాల్లో మరో 20 మంది యువకులు కింద పడిన బొగ్గును బస్తాల్లోకి నింపుతారు. కొద్దిసేపటికే వాటిని లారీల్లోకి ఎక్కించి ఎల్కల్‌పల్లి, రాణాపూర్, కన్నాల మీదుగా పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు తరలిస్తారు.
 
రోజూ 200 టన్నులకుపైగా దందా
రోజూ సుమారు 200 టన్నులకుపైగా బొగ్గును పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో టన్ను బొగ్గు రూ.20 వేలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన ప్రతినెలా రూ.10 కోట్లు చొప్పున ఏటా రూ.100 కోట్లకు పైగా బొగ్గు దందా నడుస్తోంది. సిరామిక్, ఇనుప పరిశ్రమలు, ఇటుక బట్టీలకు పెద్ద ఎత్తున బొగ్గు అవసరం. సింగరేణి బొగ్గుకు బాగా డిమాండ్ ఉండటంతో ఆయా సంస్థలు బొగ్గు మాఫియాకు పెద్దమొత్తంలో అడ్వాన్స్‌గా సొమ్ము చెల్లించి సరుకును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ప్రాణాలకు తెగించి...
నడుస్తున్న రైలును ఎక్కుతున్న యువకుల్లో ఎక్కువ మంది గోదావరిఖని సమీపంలోని ల క్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులే. ఒక్కో యువకుడికి మధ్యాహ్నం భోజనం, క్వార్టర్ మందుతోపాటు రూ.200 చెల్లిస్తున్నారు. రెండు గంటలు కష్టపడితే రోజుకు సరిపడా డబ్బులొస్తాయనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి యువకులు బొగ్గు మాఫియాకు సహకరిస్తున్నారు. వచ్చిన డబ్బుతో వ్యసనాలకు లోనవుతున్నారు. నడుస్తున్న రెలైక్కబోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నవారూ ఉన్నారు. గత ఏడాది ఓ యువకుడు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు.
 
కేసులు, అరెస్టులు అంతంతమాత్రమే
ఏటా రూ.కోట్లలో బొగ్గు దందా జరుగుతున్నా పోలీసులు, సింగరేణి, ఎన్టీపీసీ బీట్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2015లో బొగ్గు దొంగలపై పోలీసులు 10 కేసులు నమోదు చేసి 35 మంది అరెస్టు చేశారు. అయితే, సింగరేణి, ఎన్టీపీసీలోని కొందరు ఇంటిదొంగలు ఈ దందాకు సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరికి నెలనెలా మామూళ్లు అందుతున్నందుకే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు, టార్గెట్ల కోసమే అప్పుడప్పుడు బొగ్గు లారీలను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

బొగ్గు దందా వెనుక రాజకీయ పలుకుబడి గల వ్యక్తులు, మాజీ, తాజా ప్రజాప్రతినిధులున్నట్లు తెలుస్తోంది. ఈ దందా ద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం ముఠా నాయకుడికి, మరో 20 శాతం బొగ్గును దొంగలకు, మిగతా 30 శాతం సింగరేణిలోని ఇంటిదొంగలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు