సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు

20 Nov, 2015 01:07 IST|Sakshi
సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్‌లో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.25వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతిఏటా ఇంతేమొత్తం కేటాయించి వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నివారించడానికి బడ్జెట్ కేటాయింపులను సులభతరం చేస్తామన్నారు. విధివిధానాలను రూపొం దించేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ ప్రక్రియ దాదాపు పూర్తయినందున పనుల్లో వేగం పెంచాలని, లైడార్ సర్వే నివేదిక వచ్చినందున తగిన కార్యాచరణతో సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మా ణం నత్తనడకకు మారుపేరుగా మారిందని, ఈ పరిస్థితిని మార్చేందుకు సరళ పద్ధతులు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న భూసేకరణ, బిల్లుల చెల్లింపును సులభతరం చేస్తామని తెలిపారు.

ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములు కొనుగోలు చేస్తున్నామని, దీంతో భూసేకరణలో జరిగే జాప్యాన్ని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ నెల 24న ఎంసీహెచ్‌ఆర్‌డీలో వాటర్‌గ్రిడ్‌పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈమేరకు సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
 
కేటాయింపులన్నీ ఒకే పద్దు కిందకు!
రాష్ట్రంలో ప్రస్తుతం 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితోపాటే కొత్తగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదనంగా 46 వేల చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు పూనుకుంది. వీటికోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పాలమూరు, ప్రాణహిత, డిండి ప్రాజెక్టులకే ఏకంగా రూ.10 వేల కోట్ల కేటాయింపులు జరిపేందుకు ప్రణాళికలు వేస్తోంది.

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కొత్త ప్రాజెక్టుల నుంచి పాక్షికంగా అయినా నీరివ్వాలని భావిస్తోంది. అయితే లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆర్థికశాఖ సహకారం ఎంతైనా అవసరం. పరిపాలనా అనుమతుల మంజూరు, విడుదలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలి. ఇందుకనుగుణం గా కొన్ని మార్పులు చేయాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి విన్నవించింది.

ప్రాజెక్టులవారీగా ప్రత్యే క పద్దులుండటం వల్ల, పనులు కొనసాగని ప్రాజెక్టులకు కేటాయించిన పద్దుల నుంచి ఇతర ప్రాజెక్టులకు నిధులను మళ్లించడం కష్టసాధ్యమవుతోంది. ఈ దృష్ట్యా అన్ని ప్రాజెక్టుల కేటాయింపులను ఒకే పద్దు కింద పెట్టి, పనులను బట్టి నిధులు విడుదల చేసే విధానాన్ని తేవాలని కోరింది. అలాగే ఎప్పటికప్పుడు నిధుల విడుదల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కోరుతోంది.

మరిన్ని వార్తలు