రూ.304 కోట్లతో ‘వాష్’ ప్రణాళిక

19 Jul, 2015 02:32 IST|Sakshi
రూ.304 కోట్లతో ‘వాష్’ ప్రణాళిక

కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ‘సెర్ప్’ అధికారులు
ఈ ఏడాది వెయ్యి గ్రామాల్లో 2.5 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్ణయం

 
హైదరాబాద్: ‘తెలంగాణవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ 60 శాతం కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం లేక ఆరుబయటే మల విసర్జన చేస్తున్నారు.’ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్, యునిసెఫ్ చేపట్టిన సర్వేలో వెల్లడైన కఠోర వాస్తవమిది. దీంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం వాటర్, శానిటేషన్, హైజిన్ (వాష్) ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతపట్ల విస్తృత అవగాహన కల్పించాలని సర్కారు భావిస్తోంది. సర్కారు ఆదేశాల మేరకు రూ.304 కోట్ల వ్యయంతో ‘సెర్ప్’ అధికారులు తాజాగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా 26 గ్రామాల్లో తాము చేపట్టిన ‘వాష్’ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని, ఆయా గ్రామాల్లో కుటుంబాలన్నింటికీ మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించామని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. వాటి వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెచ్చామన్నారు. జూలై 1 నుంచి ఎంపిక చేసిన, అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో వాష్ కార్యక్రమాన్ని ‘సెర్ప్’ చేపడుతోంది. తొలి దశలో వెయ్యి గ్రామాల్లో ‘వాష్’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

‘వాష్’ అమలు ఇలా..
 ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ అమలు బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు స్థానికంగా గ్రామ సమాఖ్యల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తారు. ప్రజలతో గ్రామసభలు నిర్వహించి నిర్ణీత సమయంలోగా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మూడు (ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, విజిలెన్స్) ఉప కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు. ప్రతి మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200 గ్రామ సమాఖ ్య ద్వారా ‘సెర్ప్’ అందజేస్తుంది.  మరుగుదొడ్ల నిర్మాణాన్ని, వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యత విజిలెన్స్ కమిటీలదే.
 

>
మరిన్ని వార్తలు