అరకొర విదిలింపులే

26 Feb, 2016 03:52 IST|Sakshi
అరకొర విదిలింపులే

బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 790 కోట్లు కేటాయింపు
♦ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు
♦ హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్-2 పీపీపీ విధానంలోనే..
♦ ఊసేలేని కాజీపేట డివిజన్, రైల్వే విశాఖ జోన్
♦ విభజన చట్టంలోని హామీలకూ మొండిచెయ్యే!
 
 సాక్షి, న్యూఢిల్లీ
 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు అరకొర నిధులే దక్కాయి. రాష్ట్రానికి మొత్తంగా రూ. 790 కోట్లు కేటాయించారు. రెండు కొత్త మార్గాలకు నిధులు కేటాయించడంతోపాటు మూడు కొత్త మార్గాలకు సర్వే పనులను చేపట్టనున్నట్లు రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను మాత్రం విస్మరించారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీల ఏర్పాటు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కొత్తగా రైళ్లను కూడా వేయలేదు. హైదరాబాద్‌లో ఘట్‌కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా... దానిని పీపీపీ విధానంలోనే ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రైల్వేమంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ఇటు తెలంగాణ ప్రస్తావనగానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనగానీ తీసుకురాకపోవడం గమనార్హం. ఇక ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు కేటాయించారు. ఏపీలో రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులివ్వడంతోపాటు కొత్తగా పది మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సుందరీకరిస్తామని, విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు