200 మంది అమ్మాయిల్ని చిత్రహింసలు పెట్టి..

23 Apr, 2017 18:15 IST|Sakshi
200 మంది అమ్మాయిల్ని చిత్రహింసలు పెట్టి..

- అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ కండక్టర్
- భార్య స్నేహితురాళ్లనూ వదలని కీచకుడు
- విజయవాడలో సంచలనం.. ఇద్దరి అరెస్ట్‌

విజయవాడ:
యువతులు, మహిళలు కలుపుకొని దాదాపు 200 మందిని ఆడవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన ఆర్టీసీ కండక్టర్‌ కీచకవ్యవహారం విజయవాడలో సంచలనం రేపుతున్నది. మహిళా ప్రయాణికులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి తడమటం లాంటి వికృతచేష్టలకుతోడు బస్సుల్లో ప్రయాణించే యువతులు చూపించే బస్సు పాస్‌లలో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోవడం, తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్‌లో ఉన్న మహిళల నెంబర్లుకు ఫోన్లుచేయడం, రోడ్లపై, పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్‌ నెంబర్లను సేకరించి వారికి నరకం చూపించడం ఇతని నిత్యకృత్యం.

ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కండక్టర్‌ పమిడిపాటి శ్రీనివాసరావును, అతని స్నేహితుడు మార్లపూడి శామ్యూల్‌ను సినీ ఫక్కీలో అరెస్టుచేశారు. విజయవాడ సిటీ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ పాలరాజు సూర్యారావుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

గుర్తుతెలియని వ్యక్తులు వేర్వేరు ఫోన్‌ నెంబర్లనుండి చెప్పలేని విధంగా అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్నారని పటమట ఎన్‌.టీ.ఆర్‌.సర్కిల్‌ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి.. 21వ తేదీ రాత్రి గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమకందిన సమాచారం ప్రకారం 22వ తేదీన గవర్నర్‌పేట బస్‌ డిపో వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు, వారి నుంచి 5 సెల్‌ఫోన్‌లు, 3 సిమ్‌ కార్డులు, 9 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నిందితులలో ఒకరిని పమిడిపాటి శ్రీనివాసరావుగా గుర్తించినట్లు, అతను ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో యనమలకుదురులో నివసిస్తున్నట్లు వివరించారు.

విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా మహిళా ప్రయాణికులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి వారిని తడమటం చేస్తుంటాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఫోన్‌ ద్వారా మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వికృతానందం పొందుతుంటాడన్నారు. బస్సుల్లో ప్రయాణించే యువతులు చూపించే బస్సు పాస్‌లలో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోవడం, తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్‌లో ఉన్న మహిళల నెంబర్లు తీసుకోవడం, రోడ్లపై పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్‌ నెంబర్లను సేకరించి వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నట్లుకూడా వెల్లడైందన్నారు. కండక్టర్‌ అనేక సిమ్‌ కార్డులు పొంది వాటి నుండి మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతుంటాడని చెప్పారు. బస్సులో తనకు పరిచయమైన సింగ్‌నగర్‌కు చెందిన మార్లపూడి శామ్యూల్‌కు ఇదే అలవాటు ఉండటంతో అతనితో కలిసి కండక్టర్‌ మెసేజ్‌లు పంపేవాడన్నారు. వీరిద్దరు కలిసి ఎక్కడైనా సిమ్‌ కార్డులు దొరికన వెంటనే వాటిని ఉపయోగించి మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి పైశాచికానందం పొందేవారని డీసీపీ చెప్పారు. ఈ సమావేశంలో సెంట్రల్‌ ఏసీపీ శ్రీనివాస్, గవర్నర్‌పేట సీఐ పవన్‌ కుమార్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా