‘సెస్’ వినియోగంపై ఆర్టీసీ దృష్టి

23 Sep, 2015 02:45 IST|Sakshi

ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల నుంచి ప్రతి టికెట్‌పై వసూలు చేసే సెస్‌ను నిర్దేశిత లక్ష్యం కోసం ఖర్చు పెట్టే విషయంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్టాండ్ల వారీగా అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి తక్షణ పరిష్కారం కోసం ఆ నిధులు విడుదల చేస్తోంది. ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల తక్షణ పరిష్కారం కోసం పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో ప్రతి టికెట్‌పై రూపాయి చొప్పున వసూలు చేసే సెస్ దారిమళ్లుతున్న తీరుపై మూడు రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
 
 దీనికి ఆర్టీసీ జేఎండీ రమణారావు మంగళవారం వివరణ ఇచ్చారు. సెస్ మొత్తాన్ని ప్రయాణికులకు వసతులు కల్పించటం, సమస్యలు పరిష్కరించేందుకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెస్ రూపంలో వసూలయ్యే మొత్తంలో రూ.21 కోట్లను తక్షణ సమస్యల పరిష్కారానికి కేటాయించినట్టు చెప్పారు. ఇందులో రూ.7 కోట్లు మరమ్మతులకు, పారిశుధ్య పనుల నిర్వహణకు, తాగునీటి వసతి మెరుగుకు, రూ.14 కోట్లను బస్సు స్టేషన్‌ల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్స్‌కు కేటాయించినట్టు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాలు పెరగడం, పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా అభివృద్ధి పనులు, వారి అవసరాలకు నిధులు కేటాయించలేకపోతున్నట్టు పేర్కొన్నారు. దీంతోనే సెస్‌ను అమల్లోకి తెచ్చినట్టు వివరించారు.

మరిన్ని వార్తలు