దేవుళ్లను అవమానించారు!

20 Jul, 2017 09:41 IST|Sakshi
దేవుళ్లను అవమానించారు!

రాజ్యసభలో ఎస్పీ ఎంపీ అగర్వాల్‌ వ్యాఖ్యపై దుమారం
క్షమాపణకు అధికార పక్షం డిమాండ్‌
సభ రెండుసార్లు వాయిదా.. ఎట్టకేలకు దిగొచ్చిన నరేశ్‌ అగర్వాల్‌..
మన్‌ కీ బాత్‌ ఆపండి.. రుణాల్ని మాఫీ చేయండి: లోక్‌సభలో విపక్షాలు


న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లపై రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు బుధవారం తీవ్ర దుమారం సృష్టించాయి. హిందూ దేవుళ్లను ఆల్కహాల్‌ బ్రాండ్‌లతో అగర్వాల్‌ పోల్చారని, సభ వెలుపల ఆయన ఆ వ్యాఖ్యలు చేసుంటే తప్పకుండా కేసు పెడతారని సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర మిత్రపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయన క్షమాపణకు పట్టుబట్టాయి. అందుకు అగర్వాల్‌ నిరాకరించడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం సమావేశమయ్యాక ఆయన క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ‘దళితులు, మైనార్టీలపై పెరుగుతున్న హత్యాచారాలు, దాడులు’ అంశంపై చర్చ సందర్భంగా అగర్వాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘మీరు వాడిన మాటల తీవ్రత ఇంకా గుర్తించలేదు. ఇతర మతాల దేవుళ్ల గురించి అలా మాట్లాడేందుకు మీరు సాహసించగలరా?’ అని ప్రశ్నించారు. అగర్వాల్‌ వ్యాఖ్యల్ని డిప్యూటీ చైర్మన్‌ వినకపోవడంతో రికార్డుల పరిశీలనకు సభను 10 నిమిషాలు వాయిదావేశారు. అనంతరం భేటీ కాగానే కురియన్‌ మాట్లాడుతూ ‘అగర్వాల్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే ఆ వ్యాఖ్యల్ని ఎక్కడా వాడవద్దని మీడియాకు సూచించారు.

ఇంతలో అగర్వాల్‌ లేచి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటానని చెప్పగా.. ‘దేవుళ్లని అవమానిస్తే ఊరుకోం’  క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. అధికార సభ్యుల నిరసనలతో సభ వాయిదాపడింది. అనంతరం సమావేశమయ్యాక.. తన వ్యాఖ్యలకు అగర్వాల్‌ క్షమాపణలు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఏ కుల, మత విశ్వాసాల్ని అవమానించలేదని వివరణ ఇచ్చారు.

రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించింది
రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించిందన్న ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ మార్మోగింది. రైతుల దుస్థితిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ‘మన్‌ కీ బాత్‌ బంద్‌ కరో, కర్జా మాఫీ షురూ కరో’(రేడియోలో మాట్లాడడం ఆపి.. రైతు రుణ మాఫీ మొదలుపెట్టండి) అని నినాదాలు చేశారు. బీజేపీ మిత్రపక్షం స్వాభిమాని ప„Š  (ఎస్‌డబ్లు్యపీ) ఎంపీ రాజు షెట్టీ కూడా విపక్షాలతో జతకలిశారు. దీంతో సభ ప్రారంభంలోనే గంట వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని, రైతు రుణాల మాఫీతో పాటు.. పెట్టుబడి ఖర్చుల్లో 50 శాతం కంటే ఎక్కువ చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. 193వ నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌ చెప్పా రు. ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వాకౌట్‌ చేశారు.  

‘గోరక్షణ’పై రాష్ట్రాలకు పూర్తి అధికారం
‘గోరక్షణ’ పేరిట హత్యలపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాంటి సంఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ సమాధానమిచ్చారు. ప్రభుత్వ సమాధానంపై ఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. వెల్‌లోకి దూసుకెళ్లారు.  పాకిస్తాన్‌తో కలసి భారత్‌పై దాడి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని మాజీ రక్షణ మంత్రి, ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ లోక్‌సభలో పేర్కొన్నారు. అలాంటి ముప్పు ఎదురైతే ఎలా ఎదుర్కొంటారో పార్లమెంట్‌కు చెప్పాలని ఆయన కోరారు.

ట్రిపుల్‌ ఐటీలకు చట్టబద్ధ హోదా
ప్రభుత్వ, ప్రైవేట్‌  భాగస్వామ్యంలో కొనసాగేలా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ ఐటీ)లకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ పెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పేద విద్యార్థుల ఫీజులు పెంచబోమని, రిజ్వరేషన్ల చట్టం వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.‘ద ట్రిపుల్‌ ఐటీ (ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం) బిల్లు’లో భాగంగా 15 ట్రిపుల్‌ ఐటీల్ని ‘ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌’గా పరిగణిస్తారు.