అన్ని చోట్లా అధికార పార్టీలకు షాక్!

11 Mar, 2017 10:33 IST|Sakshi
అన్ని చోట్లా అధికార పార్టీలకు షాక్!

న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు ఎదురు గాలి వీచింది. ప్రభుత్వాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. శనివారం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హవా కనిపించినా.. ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలకు షాక్ తగిలింది.

ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ప్రజలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఎస్పీ ఎన్నికల బరిలో నిలిచినా అధికారం నిలబెట్టుకోలేకపోతోంది. ప్రస్తుత సమాచారం మేరకు బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పదు. పంజాబ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రజలు అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచి మెజార్టీకి చేరువవుతోంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఆప్‌ మూడో స్థానంలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.

యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లతో పోలిస్తే గోవా, మణిపూర్‌లలో అధికార పార్టీలపై ఆ స్థాయిలో వ్యతిరేకత లేకపోయినా ఎదురుగాలి తప్పలేదు. గోవాలో అధికార బీజేపీ వెనకబడింది. మణిపూర్‌లో అధికార కాంగ్రెస్ కు హోరాహోరీ పోరు ఎదురైంది. ప్రస్తుత సరళిని పరిశీలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ పూర్తి మెజార్టీ సాధించే అవకాశం కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు