రూపాయి 58 పైసలు డౌన్

13 Dec, 2013 02:45 IST|Sakshi
రూపాయి 58 పైసలు డౌన్

 ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల పతనబాట, ఎగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ప్రభావంతో రూపాయి భారీగా క్షీణించింది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 58 పైసలు నష్టపోయి 61.83 వద్ద ముగిసింది. నెలరోజుల వ్యవధిలో ఇంత ఎక్కువగా పతనం  కావడం ఇదే తొలిసారి. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్)ను మొదలుపెట్టొచ్చనే భయాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ పుంజుకుంటోందని, ఇది దేశీ కరెన్సీపై ప్రతికూలతకు దారితీస్తున్నట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. చమురు కంపెనీల నుంచి తాజాగా డాలర్లకు డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజూ నష్టాల్లోకి జారిపోవడం వంటివి రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు