చిదంబరమంత్రం ఫలిస్తుందా?

26 Aug, 2013 02:17 IST|Sakshi
చిదంబరమంత్రం ఫలిస్తుందా?

 ముంబై: అనూహ్యంగా గత శుక్రవారం 135 పైసలు పుంజుకున్న రూపాయి మారకం విలువ మరింత కోలుకునే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్), అదేవిధంగా ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి చిదంబరం భరోసా ఇవ్వడం రూపాయికి మద్దతుగా నిలిచాయని పలు బ్యాంకులకు చెందిన ట్రెజరీ విభాగం అధిపతులు పేర్కొన్నారు. కరెన్సీ స్థిరీకరణకు ప్రభుత్వం, ఆర్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటాయన్న భరోసాతో ఇన్వెస్టర్లు ఉన్నారని... ఈ వారంలో దేశీ కరెన్సీ పుంజుకునే అవకాశాలున్నట్లు ధనలక్ష్మి బ్యాంక్ ట్రెజరర్ శ్రీనివాస రాఘవన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 22న డాలరుతో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 65.56 కనిష్టానికి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరించొచ్చన్న భయాందోళనలు దీనికి ఆజ్యంపోశాయి. అయితే, 23న చిదంబరం ప్రకటన తర్వాత ఒక్కసారిగా 135 పైసలు బలపడిన రూపాయి 63.20 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా దేశీ కరెన్సీ దాదాపు 20 శాతం పతనమైంది.
 రూపాయి భారీ పతనం నేపథ్యంలో టాప్ బ్యాంకర్లు, విదేశీ ఇన్వెస్టర్లతో చిదంబరం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గత శనివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)లోపెట్టుబడులపై నియంత్రణ భయాలను తొలగించడం, విదేశీ నిధుల సమీకరణ ప్రణాళికలను ఈ సందర్భంగా చర్చించారు. వచ్చే వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన చర్యలు వెలువడతాయని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ పేర్కొన్నా రు కూడా. కాగా, రూపాయి 62.50-64.50 శ్రేణిలో కదలాడవచ్చనేది కొందరు మార్కెట్ వర్గాల అంచనా. ‘రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ఆర్‌బీఐ ప్రయత్నించొచ్చు.  64.50 దిగువకు పడిపోతే ఎగుమతిదారులు డాలర్లను విక్రయించే అవకాశం ఉంది’ అని స్టాన్‌చార్ట్  ఎండీ అగమ్ గుప్తా అభిప్రాయపడ్డారు.
 
 90ల నాటి పరిస్థితుల్లోకి ఆసియా దేశాలు!
 అమెరికాలో వాస్తవ(రియల్) వడ్డీరేట్లు ఎగబాకడం, డాలరు విలువ దూసుకెళ్తుండటంతో ఆసియా దేశాల్లో మళ్లీ 90ల నాటి ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. సాధారణ వడ్డీరేట్లపై ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక గణించేదాన్ని రియల్ వడ్డీరేటుగా పేర్కొంటారు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మళ్లీ కఠిన పాలసీ(ప్యాకేజీల్లో కోత, వడ్డీరేట్ల పెంపు)కి మరళొచ్చన్న అంచనాలతో ఈ రేట్లు పుంజుకుంటూ వస్తున్నాయి. డాలరు కూడా దూసుకెళ్తోంది. దీనివల్ల ఆసియా దేశాల్లో కూడా రియల్ రేట్లను ఎగదోస్తాయని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. అసలే పలు దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు మరింత పడిపోయేందుకు ఈ పరిణామాలు ఆజ్యంపోస్తాయని పేర్కొంది. డాలరు విలువ ఇలాగే పెరుగుతూపోతే... 1990 దశాబ్దం మధ్య నుంచి 2001 వరకూ ఆసియా దేశాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులే పునరావృతమయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అప్పట్లో అమెరికా రియల్ రేట్లు ఎగబాకి, వాణిజ్యలోటు తగ్గిపోవడంతో డాలరు పరుగులు తీసింది. దీంతో ఆసియా దేశాల్లో కరెన్సీలు ఘోరంగా పడిపోవడంతోపాటు రియల్ రేట్లు దూసుకెళ్లి వృద్ధిరేటు ఆవిరయ్యేందుకు దారితీసింది. ముఖ్యంగా అధిక కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) సమస్యలు ఎదుర్కొంటున్న భారత్ తదితర దేశాల్లో చెల్లింపుల రిస్క్‌లు మరింత పెరిగే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు