-

షార్ట్ కవరింగ్ ర్యాలీ...

31 Aug, 2013 01:44 IST|Sakshi
షార్ట్ కవరింగ్ ర్యాలీ...

 వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి బలపడటం కూడా దోహదపడింది. మరోవైపు షార్ట్ కవరింగ్ కూడా జోరందుకోవడంతో సెన్సెక్స్ 219 పాయింట్లు లాభపడి 18,620 వద్ద ముగిసింది. అయితే 18,273-18,679 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇక ఇదే విధంగా స్పందించిన నిఫ్టీ కూడా 5,493-5,360 మధ్య సంచరించింది. చివరకు 63 పాయింట్లు జమ చేసుకుని 5,472 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు రెండు వారాల గరిష్ట స్థాయికి చేరాయి.
 
 భవిష్యత్‌లో రూపాయితోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటాయన్న ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలు సెంటిమెంట్‌కు బలాన్నిచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటిష్ పార్లమెంట్(హౌస్‌ఆఫ్‌కామన్స్) సిరియాపై సైనిక దాడులకు వ్యతిరేకంగా ఓటు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు మరికొంత ఉపశమించాయి. ఇది కూడా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని విశ్లేషకులు తెలిపారు.
 
 మెటల్స్ డీలా: బీఎస్‌ఈలో హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో లాభపడగా, మెటల్స్ 2% క్షీణించింది. రూ. 1,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించినప్పటికీ జిందాల్ స్టీల్ 9% కుప్పకూల గా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసా గోవా, హిందాల్కో, టాటా స్టీల్ 5-1.5% మధ్య పతనమయ్యాయి.
 

మరిన్ని వార్తలు