పాకిస్తాన్కు రష్యా హెచ్చరికలు

1 Oct, 2016 13:16 IST|Sakshi
పాకిస్తాన్కు రష్యా హెచ్చరికలు
పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రష్యా హెచ్చరించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న టెన్షన్ వాతావరణం మరింత ఉధృతం కాక ముందే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలని సూచించింది. ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుకోవాలని ఆదేశించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంలో తాము అన్నివేళలా సహకరిస్తామని పరోక్షంగా పాకిస్తాన్కు రష్యా హెచ్చరికలు చేసింది. 
 
ఇండియా, పాకిస్తాన్ల మధ్య నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోలేని పక్షంలో మరింత ఉధృత వాతావరణం ఏర్పడే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తమ భూభాగంలోని ఉగ్రమూక గ్రూపులపై కఠిన చర్యలు అవలంభించాలని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపారు. ఉడీ ఘటన అనంతరం పాక్ ఉగ్రవాదులపై ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదలచేసింది.
 
నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న ఉగ్రమూకలను ఏరివేయడానికి సెప్టెంబర్ 28 అర్థరాత్రి భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా, రష్యా సహా పలు ప్రపంచ దేశాల నుంచి పూర్తి మద్దతు వస్తోంది. దీంతో పాక్ ఏకాకి మారుతోంది. 
>
మరిన్ని వార్తలు