నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్‌!

7 Nov, 2016 19:52 IST|Sakshi
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్‌!
  • భారీ విధ్వంసానికి కుట్రపన్నిన లష్కరే
  • ఉగ్రవాద దాడులు పొంచి ఉండటంతో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచిన నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరో మార్గం మీదుగా దేశంలోకి ప్రవేశించి.. భారీ విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నారు. నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ భారత్‌లో మరో భారీ విధ్వంసానికి పథకం రచిస్తున్నాడు. ఇందుకోసం సరిహద్దుల్లో ఉన్న నదులు, కాలువలను ఉపయోగించుకొని తన ఉగ్రమూకను దేశంలోకి పంపాలని అతను కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్‌కు లష్కరే కమాండర్‌ అబు ఇర్ఫాన్‌ తందేవాలాను ఇన్‌చార్జిగా సయీద్‌ నియమించినట్టు సమాచారం. దేశంలో భారీ మారణహోమం లక్ష్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనబోతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

    ఈ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వీలుగా పాక్‌ సైన్యం లోపాయికారి సహకారం అందిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల మీదుగా ఉన్న నదులు, కాలువ మార్గాల వద్ద భారత సైన్యం నిఘాను, భద్రతను మరింత పెంచింది. అంతేకాకుండా అనుమానిత చొరబాటు మార్గాల వద్ద బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌) ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పహారా కాస్తున్నది. భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రికార్డుస్థాయిలో  ఉగ్రవాద చొరబాటు యత్నాలు ఈసారి జరిగాయని, సెప్టెంబర్‌ 29 తర్వాత దాదాపు 15 చొరబాటు యత్నాలను బీఎస్‌ఎఫ్‌ భగ్నం చేసిందని సమాచారం. కాగా, భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మూడు నదులు, 11 కాలువలు ఉన్నాయి. 
      
మరిన్ని వార్తలు