రసవత్తరంగా సాగిన టాంటెక్స్ సాహిత్య వేదిక!

22 Sep, 2016 20:52 IST|Sakshi

టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ''నెలనెలా తెలుగు వెన్నెల'' సాహిత్య సదస్సు ఆదివారం 18న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 110 నెలల పాటు సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డల్లస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి అనుశ్రీ, 'లంబోదర లకుమికరా' ప్రార్థనాగీతంతో ప్రారంభించగా, సినీ నేపథ్యగాయని నీహారిక, 'యాకుందేందు' జననీ శివకామినీ, లలిత ప్రియకమలం' వంటి గీతాలను రమణీయంగా ఆలపించారు. 110వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట నిర్మలా రాణి, ఆధునిక కవిత్వం, కొన్ని కవితారూపాలు, గజేల్ రచన నియమాలు అనే అంశంపై ప్రసంగించారు. పాతాళ గరికె, లోపలిమెట్లు వంటి కవితా సంకలనాలు రచించి 'కనుల దోసిలి' అనే గజేల్ సంకలనం త్వరలో విడుదల చేయనున్నారు.

వచన కవిత్వం, మినీ కవిత్వం, నానో హైకో, నానీ అంటూ ఆధునిక కవిత్వంలో వచ్చిన మార్పులు, అన్ని రకాల ఉదాహరణలతో ప్రారంభమైన ప్రసంగం, మెల్లిగా గజేల్ రచనల నియమాలు, పార్శీ భాష నుంచి ఉర్దూలోకి గజేల్గా చేరి తెలుగులోకి వచ్చిన వైనం తెలియజేస్తూ సాగింది. సాహిత్యవేదికకు సుపరిచితులు, గేయరచయిత, గాయకులు మాట్ల తిరుపతి 'కవిత్వం-బంధాలు-మానవత్వమా ఏది నీ చిరునామా' అనే అంశంపై ప్రసంగించారు. సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, సరదాగా కాసేపు -6 ప్రశ్నావళి కార్యక్రమాన్ని హోరాహోరీ పోటీతో జనరంజకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరూ ప్రశ్నావినోదం కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కార్యక్రమాన్ని నిర్వహించిన అట్లూరి స్వర్ణ ను అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తోట నిర్మలా రాణిగారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు చాగర్లమూడి సుగన్ శాలువతో కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, తక్షణ పూర్వధ్యక్షులు ఊరిమిండి నరసింహారెడ్డి, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక బృంద సభ్యులు మా దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, ప్రసార మాధ్యమాలైన టి.ఎన్.ఐలకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు