2030కి ఆకలి కేకలకు అంతం!

7 Jan, 2017 02:07 IST|Sakshi
2030కి ఆకలి కేకలకు అంతం!

సమతుల పౌష్టికాహారమే ఇప్పుడు మన ముందున్న సమస్య
చిరు ధాన్యాలతోనే పౌష్టికాహారం.. పప్పు ధాన్యాల వినియోగాన్ని పెంచాలి
నిత్య హరిత విప్లవం ద్వారానే ఇది సాధ్యం
వరి, గోధుమలతో పాటు చిరుధాన్యాలను తక్కువ ధరకు అందించాలి
సముద్ర మట్టం పెరిగితే నష్టపోయేది వ్యవసాయ రంగమే..
దీన్ని నివారించడానికి మడ అడవులను పెంచాలి
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్‌ స్వామినాథన్‌  


(తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఆకలి కేకల నుంచి భారత్‌ విముక్తం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, బహుశా 2030 నాటికి ఆకలి బాధ అంతమవుతుందని హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం ముందున్న అతి పెద్ద సమస్య సమతుల పౌష్టికాహారమన్నారు. ఆహార భద్రతా చట్టం దేశ చరిత్రలో ఓ మైలురాయని అభివర్ణించారు. అందరికీ పౌష్టికాహారం అందాలంటే శాశ్వత హరిత విప్లవమే(ఎవర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌) మార్గమని స్పష్టం చేశారు. 104వ సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా శుక్రవారమిక్కడ ఆహారం, పౌష్టికాహార భద్రతపై ప్రసంగించారు. అనంతరం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పలు అంశాలను చెప్పారు.

బెంగాల్‌ కరువు మొదలు ఆహార భద్రత వరకు
1942–43లో వచ్చిన బెంగాల్‌ కరువుతో వేలాది మంది క్షుద్బాధతో మరణించారు. అయితే ఆ వేళ ఆహారం లేక జనం చచ్చిపోయిన దానికన్నా సరైన పంపిణీ లేదా అందుబాటులో లేక మరణించారు. ఆ దుస్థితి నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకు స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు పలువురు వ్యవసాయం, నీటిపారుదల, ఎరువుల రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ విధానం (మార్కెటింగ్, ధరలు, సేకరణ), ప్రజా ప్రాతినిధ్యం కీలకాంశాలుగా సాగిన ఆ ఉద్యమంతో 1968 నాటికి తిండిగింజల తిప్పలు తీరాయి. ఆనాటి ఉద్యమం మధ్యలోనే విఫలమైనా... 2013లో తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టం దేశ చరిత్రలో ఓ మైలు రాయి. ఈ చట్టంతో అందరికీ సమతుల ఆహారం అందాల్సి ఉంది. వరి, గోధుమలతో పాటు చిరుధాన్యాలను అతి తక్కువ ధరకు అందించాలి.

2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధి...
2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధిని సాధించాలన్నది ప్రస్తుత ఎజెండా. కేంద్రప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఇదొకటి. ఆకలిని అంతం చేయడం, ఆహార లక్ష్యాన్ని సాధించడం, పౌష్టికాహారాన్ని అందించడం మన ముందున్న లక్ష్యం. 2020 నాటికి దేశంలో వంద మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అదే స్థాయిలో చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల దిగుబడి, వినియోగం కూడా పెరగాలి. అప్పుడే సమతుల ఆహారం అందించినట్టవుతుంది. ఈ లక్ష్య సాధనకు నిత్య హరిత విప్లవమే మార్గం. ఇది శాశ్వతంగా సాగాలి. 2010లో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం ఈ అంశంపై కలసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. క్యాలరీలు, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు సమపాళ్లలో అందకపోతే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్నే శాస్త్రపరిభాషలో హిడెన్‌ హంగర్‌ అంటారు.(తీరని ఆకలి. కడుపు నిండుతుందే తప్ప పోషకాలు ఉండవు. ఫలితంగా వ్యాధులు వస్తాయి.) ఈ నేపథ్యంలో ఈ బయో ఫోర్టిఫికేషన్‌ (బయోటెక్నాలజీతో పోషక విలువలున్న వంగడాలను సృష్టించడం) వంగడాలను రూపొందించాలి.

బొటానికల్‌ గార్డెన్స్‌ ప్రాధాన్యత పెరగాలి...
గతంలో మనకు ప్రతి ఇంటా కూరగాయల పందిళ్లు ఉండేవి. ఇప్పుడు లేదు. అవకాశం ఉన్న ప్రతి ఇంటా బొటానికల్‌ గార్డెన్లు, కిచెన్‌ గార్డెన్లను పెంచితే అటు పర్యావరణానికి ఇటు పోషకాలకూ ఢోకా ఉండదు.

సముద్ర మట్టం పెరిగితే అంతా అనర్థమే...
ప్రస్తుతం పర్యావరణానికి ముంచుకొస్తున్న సమస్య సముద్ర మట్టం పెరగడం. దీన్ని నివారించేలా మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి. సముద్ర మట్టాలు పెరిగితే తొలుత నష్టపోయేది వ్యవసాయ రంగమే. ఆగ్రో బయోడైవర్శిటీని కాపాడుకునేలా సంప్రదాయ దృక్పథంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ముందుకు వెళ్లాలి.

ఆహార భద్రత అంటే..
ఆహార అవసరాలను తీర్చేందుకు అవసరమైన తిండిగింజలను భౌతికంగా అందుబాటులో ఉంచడమే కాకుండా అవి సామాజికంగా, ఆర్థికంగా, అందరికీ సరిపడా అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే క్రియాశీల, ఆరోగ్యకరమైన జీవనానికి అనువైన ఆహారాన్ని అందించినట్టవుతుంది. దీన్నే ఆహార భద్రత అంటారు.

పోషకాహార భద్రత అంటే..
సమతుల ఆహా రాన్ని అందరికీ భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉంచాలి. రక్షిత మంచి నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడం.

యువత ఎందుకు మొగ్గు చూపడం లేదు?
ఆర్థికంగా గిట్టుబాటు కాకనే. వాస్తవ ఆదాయం వస్తుందన్న భరోసా ఉంటే యువకులు వస్తారు. ఐటీ రంగంలో ఆకర్షణీయ వేతనాలున్నాయి. ఇప్పుడు వ్యవసాయ వర్సిటీలు వ్యవసాయ సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలి. ఆర్థికంగా గిట్టుబాటయ్యే పనిని ప్రభుత్వాలు చేస్తే సాంకేతికంగా, ఆకర్షణీయంగా మలిచేలా విశ్వవిద్యాలయాలు చేయాలి. పాలకులు పంటల బీమా, ఇతరత్రా రాయితీలు వంటి పథకాలను ప్రవేశపెట్టినా అవి పరిమితమైనవి.

పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయంపై..
ఆయన తరఫున స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ భవానీ సమాధానం ఇస్తూ... ఎవరికి తోచిన రీతిలో వారు భూమిని సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలేకర్‌ విధానంపై మాకు నిర్ధిష్టమైన అభిప్రాయమేమీ లేదు. ఒకరు సేంద్రీయం అంటున్నారు, మరొకరు ప్రకృతి సేద్యం అంటున్నారు. ఇంకొకరు సంప్రదాయ సేద్యం అంటున్నారు. ఇలా ఎన్ని ఉన్నా అందరి లక్ష్యం మానవాళి సంక్షేమమే, భూ ఆరోగ్యస్థితిని కాపాడడమమే కదా...!!

పేదలకు వరం చిలగడదుంప
పౌష్టికాహారాన్ని చిలగడ దుంపలోనూ (స్వీట్‌ పొటాటో) పొందవచ్చు. అల్పాదాయ వర్గాలకు ఇదో వరం. పోషకాలపై అవగాహనను పెంచాలి. ఇళ్ల వద్ద పండించే దుంపలను, పండ్లను, కూరలను విరివిగా తీసుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలి.

ఆహారమే ఔషధం...
ఎంత తింటున్నాం అనే దానికన్నా ఏమి తింటున్నాం అన్నదే ప్రధానం. అందుకే ఆహారమే ఔషధం అంటారు. మందులతో అన్ని వ్యాధులను నయం చేస్తారనుకోవడం భ్రమ. న్యూట్రీషియన్, వ్యవసాయ, ఆరోగ్య, అటవీ, వైద్య విభాగాలన్నీ కలసి పని చేయాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి.

రైతు ఆత్మహత్యలు సంక్లిష్ట సమస్య
ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. అననుకూల పరిస్థితులు, వాతావరణం, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్‌ లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రుణాలు పెద్ద సమస్యగా మారాయి. బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి వస్తే వాయిదా రూపంలో కట్టమంటున్నారు. చేతిలో డబ్బులే లేకుంటే ఎక్కడి నుంచి తీసుకువచ్చి రుణాలు చెల్లిస్తారో పాలకులు ఆలోచించాలి. ఏదైనా ఉపద్రవం వస్తే ఆదుకోవడానికి గతంలో మాదిరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఈ నేపథ్యంలో స్థానిక కమ్యూనిటీలే ధైర్యం చెప్పాలి. జీవితం ఉన్నది బతకడానికే గాని ప్రాణం తీసుకోవడానికి కాదు.

మరిన్ని వార్తలు