విరమణ తాత్కాలికమే!

13 Oct, 2013 04:33 IST|Sakshi
విరమణ తాత్కాలికమే!

‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ మీట్ ది ప్రెస్‌లో అశోక్‌బాబు
 సాక్షి, హైదరాబాద్: ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేకనే విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు మళ్లీ విధుల్లో చేరారని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత తామూ సమ్మె విరమించే అవకాశాలున్నాయన్నారు. అయితే, సమ్మె విరమణ తాత్కాలికమేనని, అవసరమైనప్పుడు మళ్లీ రంగంలోకి దిగడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమం సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని, ఆ తర్వాత ఐదేళ్లు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రం విడిపోదని ఇప్పటికీ తాను గట్టి నమ్మకంతో ఉన్నానని అశోక్‌బాబు చెప్పారు. విభజన ప్రక్రియ నిలిచిపోవటానికి సాంకేతికాంశాలు ప్రతిబంధకాలవుతాయని, ఈ దిశగా తమ ప్రయత్నం సాగుతోందని వెల్లడించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.
 
 వాళ్లు చేతులెత్తేస్తే మేం భుజానికెత్తుకున్నాం..
 విభజనను అడ్డుకోవాల్సిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతులెత్తేశారని, అందువల్లే తాము ఆ బాధ్యతను నెత్తికెత్తుకోవాల్సి వచ్చిందని అశోక్‌బాబు తెలిపారు. తెలంగాణలో సకలజనుల సమ్మె జరిగినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేగలిగారని ఆయన గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ తెలంగాణ అనుకూల ప్రకటన చేయగానే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ‘వారి వైఫల్యం వల్లనే తమకు తలకు మించిన భారమైనా ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని, ఉధృతంగా నడపగలిగాం. అదంతా ప్రజల సహకారం వల్లనే సాధ్యమైంది. మేం లేకుంటే ఈ పాటికి రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులోకి వచ్చి ఉండేది. 60 రోజులుగా కేంద్రాన్ని నిలవరించగలుగుతున్నాం. కేంద్రం మొండిగా ముందుకెళ్తే మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అన్నారు.
 
 అధికార కాంక్షే కారణం...
 సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉన్నప్పుడు వాటిని సరిదిద్దితే బావుండేదని, కొన్ని ఉద్యోగాలు పోయాయనో, మరో కారణమో చెప్తూ రాష్ట్రాన్ని విభజించటం సరికాదని అశోక్‌బాబు పేర్కొన్నారు. నేతల అధికార కాంక్షే ఈ పరిస్థితికి కారణమన్నారు. ‘తెలంగాణ ప్రాంతానికి రాజ్యాధికారం ఉండి ఉంటే ప్రత్యేక రాష్ట్ర వాదన వచ్చేది కాదేమో. ఇప్పటికైనా అన్ని పార్టీలు దీనిపై లోతుగా చర్చించుకోవాలి. తెలంగాణ ప్రాంత నేతలకు ముఖ్యమంత్రి పదవి దక్కి ఉండాల్సింది. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారమవుతుందేమో నేతలు ఆలోచించాలి’  అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కువ మంది తెలంగాణకు అనుకూలంగా ఉన్నారన్న వాదన సరికాదని మా ఉద్యమం ద్వారా తేల్చామని అశోక్‌బాబు వివరించారు.
 
 ప్రభుత్వం మోసం చేసింది
 ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా విభజనపై నిర్ణయం తీసుకుని  కేంద్రం దారుణంగా మోసం చేసిందని అశోక్‌బాబు విమర్శించారు. ఇప్పటికీ కేంద్రం స్పష్టత లేని విధివిధానాలతో అసంబద్ధ ప్రకటనలు చేస్తోందన్నారు. విభజన నిర్ణయంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పార్లమెంటు కాదంటే, పార్లమెంటు నిర్ణయాన్ని కాదనే హక్కు ప్రజలకుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని వ్యాఖ్యానించారు.
 
 మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది
 వచ్చే ఎన్నికల్లో పార్టీలను కాదని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను చూసి ఓటెయ్యాల్సిందిగా ప్రజలను కోరుతామని అశోక్‌బాబు పేర్కొన్నారు. ‘విద్యుత్తు ఉద్యోగులు సమ్మెతో సీమాంధ్ర ప్రజలు నరకం అనుభవించారు. దాంతో ఉద్యోగులు సమ్మెకు తాత్కాలిక విరామం ఇచ్చారు కానీ ప్రజల బాధలకు ప్రజాప్రతినిధులు మాత్రం చలించలేదు. అసలు వాళ్లు మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది. అధిష్టానం ఆదేశించిందనో, పార్టీ చెప్పిందనో ప్రజాకాంక్షను పట్టించుకోని రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం సమాజానికి మంచి జరగదు’ అన్నారు.
 
 ప్రత్యామ్నాయాలు అడగం
 ప్రత్యామ్నాయాల కోసం అడిగామంటే విభజనకు మద్దతిచ్చినట్టేనని అశోక్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోదనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. ఎమ్మెల్యేలు నేరుగా వారి ప్రజల ముందు అభిప్రాయాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే వారి అసలు రంగేంటో తెలుస్తుందన్నారు. ‘విభజనకో, సమైక్యానికో.. దేనికి కుప్పంలో చంద్రబాబు జై కొడతారో చూద్దాం. ఆ తర్వాత వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అన్నారు. ఒక్కో జిల్లా నుంచి వేయి మంది చొప్పున ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేస్తూ, ఒక్కో రోజు ఒక్కో జాతీయ నేతను కలవాలని నిర్ణయించామని తెలిపారు.
 
 పార్టీ పెట్టే ఖ్యాతి ఉన్నా..
 తన మనస్తత్వానికి రాజకీయాలు పడవని అశోక్‌బాబు తెలిపారు. రాజకీయాల్లో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీ పెట్టే ఖ్యాతి ఉన్నా ఆర్థికంగా, ఇతరత్రా శక్తిసామర్ధ్యాలు లేవని అన్నారు.

మరిన్ని వార్తలు