సమైక్య ఘోష.. బతుకమ్మ ఆట

5 Oct, 2013 02:46 IST|Sakshi
సమైక్య ఘోష.. బతుకమ్మ ఆట

సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సమైక్యవాదుల నిరసనలు... మరోవైపు తెలంగాణవాదుల బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్ర పరిపాలనా కేంద్రం శుక్రవారం మార్మోగింది.  రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయం అట్టుడికింది. గజానికో పోలీసును కాపలా పెట్టినా ఉద్యమకారులను నిలువరించలేకపోయారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 31 రోజులుగా విధులకు దూరంగా ఉంటున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి 60 రోజులుగా ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా కేబినెట్‌లో తెలంగాణ నోట్ ఆమోదించటంపై రగిలిపోయారు.   
 
 దొంగచాటుగా నోట్ పెట్టి తమ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారంటూ ఉదయం నుంచే సచివాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సచివాలయం ముందు రెండు గంటల సేపు ధర్నా చేపట్టారు. ‘సోనియా... క్విట్ ఇండియా’ రాహుల్ డౌన్‌డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సచివాలయం మెయిన్‌గేట్ వద్ద ధర్నాకు దిగిన దాదాపు 82 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం మహిళా ఉద్యోగులు ప్రదర్శనగా వెళ్లి సమత బ్లాక్ వద్ద బైఠాయించారు.‘ కేంద్ర హోం మంత్రి షిండే డౌన్‌డౌన్’  ‘సీమాంధ్ర మంత్రులు డౌన్‌డౌన్’ అని నినదించారు. అరెస్టులతో సమైక్య ఉద్యమాన్ని ఆపలేరని, రాష్ట్ర విభజనను సహించేది లేదని హెచ్చరించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను  పోలీసులు తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి అక్కడే విడిచిపెట్టటంతో ఉద్రిక్తత నెలకొంది. సమత బ్లాక్ వద్ద ఉన్న ఉద్యమకారులతో జత కలిసి నినాదాలు చేశారు.
 
 ఆర్డినెన్స్‌నే చించారు.. కేబినెట్ నోట్‌ను చించలేరా?
 ‘రాహుల్‌గాంధీ కోసం... రాష్ట్రపతి వద్దకు వెళ్లి వచ్చిన ఆర్డినెన్స్‌నే యూపీఏ ప్రభుత్వం చించివేసింది. ఇంతమంది ప్రజల కోసం తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా? 60 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న మా ప్రాంత ప్రజల మనోభావాలను  పట్టించుకోనప్పుడు ఈ దేశంలో మేము ఎందుకు ఉండాలి? మాకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ దేశం కావాలంటే ఇస్తారా? ప్రజా సమస్యలను పట్టించుకోని సీమాంధ్ర మంత్రులకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి’ అని సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు.
 
 బతుకమ్మ ఆడిన రాజనర్సింహ సతీమణి: తెలంగాణపై నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించటంపై సచివాలయ తెలంగాణ ఉద్యోగులు బతుకమ్మ ఆడి సంబురాలు జరుపుకున్నారు. పెత్రమాస గౌరమ్మకు  తొలిరోజు వేసే ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి ఘనంగా వేడుక చేసుకున్నారు. కే బ్లాక్‌లోని టీఎన్జీవోస్ కార్యాలయం నుంచి మహిళా ఉద్యోగులు బతుకమ్మలను ఎత్తుకొని ప్రదర్శనగా బయలుదేరారు. నల్లపోచమ్మ గుడివద్ద బతుకమ్మను పెట్టి పూజలు నిర్వహించారు. కొద్దిసేపు ఆడిపాడారు. అక్కడి నుంచి ఫైర్‌స్టేషన్ సమీపంలో బతుకమ్మలను పెట్టి ఆడారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ భార్య పద్మిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులకు తోడుగా పురుష ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘60 ఏళ్ల ఆకాంక్ష’ ‘వెయ్యికి పైగా అమరుల బలిదానాల ఫలితం’ై‘జె తెలంగాణ’ అంటూ నినదించారు. తెలంగాణ ఉద్యమ గీతాలను ఆలపించారు. అమరుల త్యాగాల్ని గుర్తుచేసుకున్నా రు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది.

మరిన్ని వార్తలు