విభజనాగ్ని.. జనోద్యమం@ 92

31 Oct, 2013 04:04 IST|Sakshi
విభజనాగ్ని.. జనోద్యమం@ 92

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 92వ రోజైన బుధవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు ఊరూరా పోటెత్తాయి. అనంతపురంలోని టవర్ క్లాక్ సర్కిల్‌లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గుంతకల్లులో  విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఆకారంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.  హిందూపురంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సమైక్యవాదులు దహనం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎన్జీవోల జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పుంగనూరులో ఎన్జీవోలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విభజన ప్రక్రియను ఆపకపోతే సీమాంధ్రులు భవిష్యత్‌లో బానిసలుగా బతకాల్సి వస్తుందంటూ వీఆర్‌వోలు చేతులకు, మెడలకు సంకెళ్లు తగిలించుకుని రాయలసీమ, కోస్తాంధ్ర ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డిని  పుంగనూరులో సమైక్యవాదులు అడ్డుకున్నారు.
 
  జై సమైక్యాంధ్ర అనాలని పట్టుపట్టారు. ఇందుకు బెరైడ్డి ససేమిరా అనడంతో గందరగోళం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రెవెన్యూ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు రాస్తారోకో చేశారు.  కలిదిండిలో  విద్యార్ధులు  మానవహారం నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో రహదారిపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద ఏపీఎన్జీఓలు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ చిత్రపటాలను దహనం చేశారు. కావలిలో  తహశీల్దార్‌కార్యాలయం సెంటర్‌లో ఎన్జీవోలు రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. గంటపాటు వాహనాల రాకపోకలు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు.
 
 హోరెత్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులు
 రాష్ట్ర విభజన నిర్ణయంపై ఎగసిపడుతున్న నిరసనోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం కూడా ఆందోళనలు హోరెత్తించారు. చిత్తూరులో ‘సమైక్య శంఖారావం’కు వేలాదిగా విద్యార్థులు కదలివచ్చారు.  పలమనే రులో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రిక్షా తొక్కి, మొక్కజొన్న పొత్తులు అమ్మి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా  పలాసలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూరులో సమైక్య దీవెన యాత్ర చేపట్టారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. కృష్ణాజిల్లా చాట్రాయిలో పోలవరం-విస్సన్నపేట రహదారిపై పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఇక ఈనెల 2వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు