‘ఎస్పీ-కాంగ్రెస్‌ పొత్తు’లో కొత్త ట్విస్ట్‌

21 Jan, 2017 18:39 IST|Sakshi
‘ఎస్పీ-కాంగ్రెస్‌ పొత్తు’లో కొత్త ట్విస్ట్‌

లక్నో: పొత్తుల ద్వారాలు దాదాపు మూతపడే సమయానికి.. ’సమయం ఉంది మిత్రమా..’  అంటూ కోరుకున్న నేస్తానికి కబురు పంపాడు అఖిలేశ్‌ యాదవ్‌! ఉత్తరప్రదేశ్‌లో ఇక ఉండదేమో అనుకున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ పార్టీల పొత్తుపై శనివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎస్పీ చీఫ్‌, యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తాజాగా ఒక ప్రతిపాదనకు తలొగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అటు బీజేపీని, ఇటు బీఎస్పీని ఒక్కసారే చిత్తు చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు తప్పదని గట్టిగా నమ్ముతోన్న అఖిలేశ్‌.. హస్తం గుర్తు పార్టీకి 99 స్థానాలు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా లేదా అనేది రేపు(ఆదివారం) ఉదయం తేలుతుందని యూపీ కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఇదే విషయంపై ఎస్పీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. 300 స్థానాలకు తగ్గకుండా పోటీచేయాలనేది తమ అభిమతమని అన్నారు. వీగిపోయిందనుకున్న పొత్తు.. ‘అఖిలేశ్‌ 99’ ఆఫర్‌తో తిరిగి జీవం పోసుకుందని అన్నారు. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో మొదటిదశ పోలింగ్‌ ఫిబ్రవరి 11న జరగనుంది.

మరిన్ని వార్తలు