నోట్7 పేలుళ్ల కారణాలేమిటో తేల్చుతాం..

13 Oct, 2016 19:08 IST|Sakshi
నోట్7 పేలుళ్ల కారణాలేమిటో తేల్చుతాం..
గెలాక్సీ నోట్7 ఫోన్ బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు ఉత్పత్తిని, మరోవైపు అమ్మకాలను రెండింటినీ శాశ్వతంగా నిలిపివేసిన శాంసంగ్, ఈ ఘటనలకు కారణమేమిటో త్వరలోనే తేల్చుతుందట. తమ ఫోన్లను వాడొద్దంటూ కఠిన హెచ్చరికలు కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు, ఫోన్ మాట్లాడినప్పుడు పేలుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దాదాపు 25 లక్షలకుపైగా ఫోన్లను కంపెనీ రీకాల్ చేసింది. రీకాల్ చేసిన ఫోన్లను రీప్లేస్మెంట్తో కొత్త ఫోన్లను విడుదలచేసింది. రీప్లేస్ చేసిన మోడల్స్ నుంచి కూడా పొగలు రావడంతో కంపెనీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.  తమ ఫోన్లు వెనక్కి పంపించేయడంటూ ప్రకటన విడుదల చేసింది. 
 
అయితే ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో కనుగొనడానికి కంపెనీ ముప్పు తిప్పులు పడుతుందట. ఈ కారణంతోనే ఇన్నిరోజులు కారణమేమిటో కూడా వెల్లడించడానికి శాంసంగ్ తీవ్ర సతమతమైందని తెలుస్తోంది. కానీ చివరగా ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో త్వరలోనే తేల్చుతామని శాంసంగ్ ప్రకటించింది. దీనిపై విచారణ కొనసాగుతుందని, వచ్చే వారాల్లో తమ ముందుకు పేలుళ్ల కారణాలు విడుదలచేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మొదటిసారి పేలుళ్లు సంభవించినప్పుడే కంపెనీకి చెందిన ఇంజనీర్లు కారణాలేమిటో కనుగొనడంలో తీవ్రంగా విఫలమైనట్టు పలు రిపోర్టులు వెల్లడించాయి. వివిధ టెస్టులు నిర్వహించినప్పటికీ ఏ కారణంతో ఇవి పేలుతున్నాయో మూల కారణాన్ని కనుగొనలేకపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
>
మరిన్ని వార్తలు