భారత్‌లోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

24 Mar, 2015 00:04 IST|Sakshi
భారత్‌లోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. యాపిల్ ఐ ఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ ఈ ఫోన్‌లను మార్కెట్‌లోకి తెస్తోంది. అంతర్జాతీయంగా విడుదల చేసిన 3 వారాల తర్వాత వీటిని భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ (మొబైల్ అండ్ ఐటీ) అశిమ్ వార్సి చెప్పారు. సోమవారం నుంచే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించామని, వచ్చే నెల 10 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ ఫోన్‌లను ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ ఆవిష్కరించింది.
 
ప్రత్యేకతలు: కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ రెండు ఫోన్‌లలో 5.1 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, (ఎస్6 ఎడ్జ్‌లో డ్యూయల్ ఎడ్జ్ స్కీన్ ఉంటుంది), 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.  వెర్లైస్ చార్జింగ్ టెక్నాలజీ ఈ ఫోన్‌ల ప్రత్యేకత. 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్6లో 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌లో 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
 
భారత్‌లో తయారీ...
 ఈ ఫోన్‌ల రూపకల్పనలో భారత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ తగిన పాత్ర పోషించిందని, ఈ ఫోన్‌లను నోయిడా ప్లాంట్‌లో ఈ ఏడాదిలోనే తయారు చేయడం ప్రారంభిస్తామని ఆశిమ్ వార్సి పేర్కొన్నారు.
 
 ధరలు..
 మెమరీ        ఎస్6    ఎస్6 ఎడ్జ్
 32 జీబీ        49,000    58,900
 64 జీబీ        55,900    64,900
 128 జీబీ        61,900    70,900

మరిన్ని వార్తలు