విమానంలో పేలిన స్మార్ట్ ఫోన్

23 Sep, 2016 18:56 IST|Sakshi
విమానంలో పేలిన స్మార్ట్ ఫోన్

చెన్నై:గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ల పేలుళ్లతో ఇబ్బందులు పడుతున్న కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ను  మరో వివాదం  చుట్టుకుంది.   సింగపూర్  నుంచి చెన్నైకి వచ్చిన  ఇండిగో విమానంలో  శాంసంగ్ నోట్ 2  బ్యాటరీ  పేలి,  పొగలు వ్యాపించాయి.  స్వల్పంగా మంటలు అంటుకోవడం కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన  సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానంలోని 182 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ఘటనపై  డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)  ఆగ్రహం వ్యక్తం  చేసింది. వెంటనే శాంసంగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సమావేశానికి హాజరు  కావాల్సిందిగా   కోరింది.

చెన్నైలో జరిగిన పేలుడు ఘనటలో ఎలాంటి నష్టం  జరగలేదు.  అయితే ఈ ఘటనతో డీజీసీఏ మరోసారి అప్రమత్తమైంది. ప్రయాణికులు శాంసంగ్  నోట్ ఫోన్లను తీసుకు రావద్దంటూ ఆంక్షలు విధించాలని ఎయిర్ లైన్స్ ను  కోరింది.  శాంసంగ్  నోట్ స్మార్ట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా  ప్రయాణికులను కోరుతూ ప్రతి విమానంలో ఒక ప్రకటన చేయాలని సూచించింది. కాగా విమానాల్లో శాంసంగ్ ఫోన్లు వాడొద్దని ఇప్పటికే డీజీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు