శశికళ వర్గం పార్టీ పేరు ఇదే..

23 Mar, 2017 12:03 IST|Sakshi
శశికళ వర్గం పార్టీ పేరు ఇదే..
జయలలిత మృతి నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు ఎవరికి దక్కేనో అన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. తమదే అసలైన అన్నాడీఎంకే పార్టీ అని, తమకే ఆ పార్టీ గుర్తును కేటాయించాలంటూ శశికళ, పన్నీర్‌ సెల్వం వర్గాలు కోరడంతో తాత్కాలికంగా ఈ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. దివంగత సీఎం జయలలిత మృతితో ఆమె నియోజకవర్గం ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో కొత్త గుర్తును ఎంచుకోవాలంటూ ఇరువర్గాలకు ఈసీ సూచించింది.

ఈ నేపథ్యంలో శశికళ వర్గం కొత్త పార్టీ పేరును తెరపైకి తెచ్చింది. 'ఏఐఏడీఎంకే అమ్మ' పేరుతో ఉప ఎన్నికల్లో తాము పాల్గొంటామని శశికళ వర్గం ఈసీకి తెలిపింది.  తమ పార్టీకి ఆటో, క్యాప్‌, బ్యాట్‌లలో ఒకదానిని గుర్తుగా కేటాయించాలని శశికళ వర్గం కోరింది. దీంతో ఆ పార్టీ కొత్త పేరును ఆమోదించి.. టోపీ గుర్తును ఈసీ కేటాయించింది. ఇక పన్నీర్‌ సెల్వం వర్గం 'ఏఐఏడీఎంకే పురచ్చి తలైవీ అమ్మ' పేరుతో ఆర్కే నగర్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ వర్గానికి 'విద్యుత్ స్తంభం' గుర్తును ఈసీ కేటాయించింది. 

అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో వచ్చిన చీలికలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతికి చిక్కడంతో, కనీసం పార్టీని, చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం తీవ్రంగానే వ్యూహలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ పన్నీర్‌ వర్గం ఈసీని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు, అభిప్రాయాలు విన్న ఈసీ.. తాత్కాలికంగా అన్నాడీఎంకే అధికారిక గుర్తు రెండాకులను స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వార్తలు