శశికళ తరలింపునకు రంగం సిద్ధం!

13 Jul, 2017 18:13 IST|Sakshi
శశికళ తరలింపునకు రంగం సిద్ధం!

బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళను అక్కడ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం అవుతోంది. జైళ్లశాఖ అధికారులు ఆమెను మరో జైలుకు మార్చే యోచనలో ఉన్నారు. కాగా  శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ఎన్‌ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.

మరోవైపు డీఐజీ రూప గురువారమిక్కడ మాట్లాడుతూ.. తన నివేదికలో చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనన్నారు. నివేదికలో పొందుపరిచిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని డీఐజీ రూప పేర్కొన్నారు.  ఇక తనపై వచ్చిన ఆరోపణలను జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ కొట్టిపారేశారు. శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు