శశికళకు ఎదురుతిరిగిన 20మంది ఎమ్మెల్యేలు?

10 Feb, 2017 07:26 IST|Sakshi
శశికళకు ఎదురుతిరిగిన 20మంది ఎమ్మెల్యేలు?

తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, శశికళ క్యాంపులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్టు సమాచారం. తాము పన్నీర్‌ సెల్వానికి మద్దతునిస్తామని, తమను విడిచిపెట్టాలని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇందుకు అనుమతించని శశి వర్గం బలవంతంగా వారిని బంధించి రిసార్ట్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. వందలమంది శశికళ మనుషులు ఎమ్మెల్యేలు జారిపోకుండా, తప్పించుకోకుండా అనుక్షణం కాపలా కాస్తున్నారని సమాచారం. ఆ 20 మంది ఎమ్మెల్యేలను శశికళ విడిచిపెడతారా? వారు ఓపీఎస్‌కు మద్దతునిచ్చేందుకు వీలుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విడిగొట్టి.. ఎవరికి తెలియకుండా వివిధ రిసార్టులకు, బీచ్‌లకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు, వారిని తన గుప్పిట ఉంచుకునేందుకు శశికళ  ఈ ఎత్తుగడ వేశారు. చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం గోల్డెన్‌ బే రిసార్ట్‌లో ఓ గ్రూపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యాంపుగా ఉన్నారు. ఈ రిసార్టుకు మీడియాను కూడా అనుమతించడం లేదు. ఉన్నఫలనా ఎమ్మెల్యేలు తరలించడంతో ఎమ్మెల్యేలు కట్టుబట్టలతో వచ్చారని, దీంతో వారికి సరైన దుస్తులు కూడా అందుబాటులో లేవని, జైలులో ఉన్న భావన వారిలో కలుగుతున్నదని తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో క్యాంపులోని పలువురు ఎమ్మెల్యేలు కలత చెందుతున్నట్టు సమాచారం. శశి క్యాంపులో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అంటున్నారు.