తెలుగువారిపై కాల్పులు: స్పందించిన సత్య నాదెళ్ల

25 Feb, 2017 12:26 IST|Sakshi

వాషింగ్టన్‌: తెలుగు ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్‌ కాల్పులపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్‌లో తెలిపారు.

తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్‌ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్‌ బార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఇప్పటికే భారత సంతతికి చెందిన అమెరికన్‌ చట్టసభ సభ్యులు ఖండించారు.