సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష

8 Dec, 2014 17:51 IST|Sakshi
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష

ఐదేళ్ల క్రితం నాటి సత్యం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. మొత్తం ఆరు కేసులకు సంబంధించి ఈ కోర్టు తన తీర్పును సోమవారం వెల్లడించింది. సత్యం రామలింగరాజు, రామరాజుకు మూడు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. అలాగే వారితో పాటు రామ్ మైనంపాటికి కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. రామలింగరాజు, రామరాజులకు ఒక్కో కేసులో ఆరునెలల పాటు నాలుగు కేసుల్లో జైలుశిక్ష కూడా విధించారు. ఎస్ఎఫ్ఐఓ మొత్తం ఏడు కేసులు నమోదు చేయగా, వాటిలో ఒక కేసును కోర్టు కొట్టేసింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. వడ్లమాని శ్రీనివాస్కు మూడు కేసుల్లో రూ. 20 వేల జరిమానా, మూడు కేసుల్లో 6 నెలల జైలుశిక్ష విధించారు. సంస్థ మాజీ డైరెక్టర్లు కృష్ణ జి.పాలెపు, ఎన్.శ్రీనివాస్, వినోద్ కె. దామ్, టి.ఆర్. ప్రసాద్లకు రూ. 20 వేల వంతున జరిమానాలు విధించారు.

ఐదేళ్ల క్రితం.. అంటే 2009 సంవత్సరంలో సత్యం స్కాం బయటపడి ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా గ్రూపు ఛైర్మన్ రామలింగరాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు. అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను తీసుకుంది. తర్వాతి నుంచి పలు మలుపులు తిరిగింది. చివరకు ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టులో కూడా ఈ కేసుల విచారణ సాగింది. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పు వెలువడింది.

మరిన్ని వార్తలు