సౌదీ ప్రిన్స్కు కొరడా దెబ్బలు, జైలు

2 Nov, 2016 16:54 IST|Sakshi
సౌదీ ప్రిన్స్కు కొరడా దెబ్బలు, జైలు

జెడ్డా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదంటారు. అయితే ఆ దెబ్బలు తినేవాడు సాక్షాత్తూ యువరాజైతే? రాజరిక వ్యవస్థలో అసలిలాంటి తీర్పును ఊహించగలమా? కానీ జరిగింది అదే. కోపంలో ఒకరిని కాల్చి చంపాడన్న కారణంగా యువరాజుకు మరణశిక్ష విధించిన సౌదీ అరేబియా రాజు.. తప్పు చేసిన మరో యువరాజును కూడా తీవ్రంగా శిక్షించాడు. వివరాల్లోకి వెళితే..

అల్ సౌద్ రాజవంశీకుల పాలనతో ఉన్న సౌదీ అరేబియాకు ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాజుగా కొనసాగుతున్నారు. పెద్ద కుటుంబం కావడంతో యువరాజుల సంఖ్య కూడా ఎక్కువే. ఆ యువరాజుల్లో ఒకరైన తుర్కీ బిన్ సౌద్ అల్ కబీర్.. ఓ వ్యక్తిని చంపిన కారణంగా మరణశిక్షకు గురయ్యాడు. ఇటీవలే చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సంగతి మర్చిపోకముందే మరో యువరాజుకు సౌదీ రాజప్రసాదం కఠిన శిక్ష విధించింది. ( సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష )

నేరం చేసినందుకుగానూ యువరాజును సోమవారం జెడ్డాలోని జైలులో కొరడాలతో చితకబాతి, ఓ గదిలో పడేశారు. ఆ యువరాజు చేసిన నేరం ఏమిటనేదిమాత్రం ఇంకా వెల్లడికాలేదు. శిక్ష తాలూకు వివరాలు మాత్రేమే సౌదీ న్యాయశాఖ వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కనీసం రెండువారాలపాటు అతను జైలులో ఉంటాడని తెలిపింది. రాజు తలుచుకుంటే యువరాజుకూ దెబ్బలు తప్పలేదు!

మరిన్ని వార్తలు