డిపాజిట్లపై ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ

1 May, 2017 14:00 IST|Sakshi
డిపాజిట్లపై ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ

ముంబై: ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు మరోషాకిచ్చింది. టెర్మ్‌ డిపాజిట్లపై రేట్లలో భారీ  కోత పెట్టింది.  మీడియం టెర్మ్, లాంగ్‌ టెర్మ్ డిపాజిట్ల పై రేట్లను సమీక్షించింది.  ఈ మేరకు  కోటి  రూపాయల లోపు డిపాజిట్ల మెచ్యూరిటీపై చెల్లించే వడ్డీరేటులో 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25శాతంగా నిర్ణయించింది. ఏప్రిల్‌ 29, 2017 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్‌బీఐ అధికారికంగా వెల్లడించింది.   
 
కొత్త నిబంధనల ప్రకారం  ఒక కోటి రూపాయలలోపు డిపాజిట్లపై ఎస్‌బీఐ గరిష్ఠంగా 6.75 శాతంతో పోలిస్తే 6.25 శాతం వడ్డీని అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఏడు రోజుల నుంచి రెండు సంవత్సరాల మధ్య  ఉండే స్వల్పకాలిక డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటును మాత్రం యథాతథంగా ఉంచింది.

అలాగే సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత పెట్టింది.  ఇప్పటిదాకా 7.25శాతంగా వున్న  ఈ రేటును 6.75శాతంగా నిర్ణయించింది. మూడేళ్లనుంచి పదిసం.రాల లోపు ఉన్న టెర్మ్‌ డిపాజిట్లపై 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించి 6.50శాతంగా ఉంచింది. సంవత్సరం నుంచి 455 రోజుల డిపాజిట్లపై 6.90 శాతం అత్యధిక రేటును అందిస్తోంది.  ఎస్‌బీఐ నిధుల ఆధారిత రుణ రేట్లను మార్చలేదు. వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ ఎనిమిది శాతంగా ఉంది.


 

మరిన్ని వార్తలు