సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం?

7 Aug, 2015 07:52 IST|Sakshi
సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం?

సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం ఒకదాన్ని రూపొందించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన సందేశాలను సోసల్ మీడియా ద్వారానే విస్తృతంగా వ్యాపింపజేస్తున్నారని, అందువల్ల కొత్త చట్టంతో దాన్ని నియంత్రించాలని సుప్రీం చెప్పింది. సోషల్ మీడియాను, ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తున్నారని, ముఖ్యంగా వివాదాస్పద సెక్షన్ 66ఎను సుప్రీంకోర్టు రద్దుచేసిన తర్వాత ఇది మరీ ఎక్కువైందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తాను రేప్ కేసులో నిందితుడిగా ఉన్నానంటూ ఇటీవల వాట్సాప్లో ఓ సందేశం విపరీతంగా వ్యాపించిందని సీనియర్ న్యాయవాది ఎల్. నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తనకు దాని గురించి చెప్పడం, పలువురు వ్యక్తులు ఫోన్ చేయడంతోనే తనకు దానిగురించి తెలిసిందన్నారు. తన గురించి కూడా సోషల్ మీడియాలో ఓ తప్పుడు సందేశం విపరీతంగా వెళ్లిందని మరో సీనియర్ న్యాయవాది కె. పరాశరన్ కూడా కోర్టుకు తెలిపారు. వాళ్ల వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. మరీ ఇలాంటి అతి స్వేచ్ఛ ఇస్తే సోషల్ మీడియాలో జనం ఇలా ప్రమాదకరమైన ప్రచారాలకు ఒడిగడుతున్నారని, ఇలాంటి చర్యలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని చేయాల్సిందేనని తెలిపింది.

మరిన్ని వార్తలు